Take a fresh look at your lifestyle.

కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ ఖర్చు ప్రభుత్వం భరిస్తుందా?

  • బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు.

ముద్ర, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ, మరమ్మతుల ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా ? అని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ప్రశ్నించారు. దీనికి సాగునీటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై ఒకవైపు చర్చ జరుగుతావుంటే సందట్లో సడేమియా అన్నట్టు గుత్తేదారు సంస్థలు కాళేశ్వరం పునరుద్ధణ ఖర్చంతా ప్రభుత్వమే భరించాలని లేఖ రాయడం పలు అనుమానాలకు తావిస్తుందని ఆయన అన్నారు. ఈ మేరకు ఆదివారం నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఎమ్మెల్యే హరీష్ బాబు మాట్లాడారు.. రెండు రోజుల క్రితం మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ సంస్థ అయిన ఎల్ అండ్ టీ – పీఈఎస్, అన్నారం బ్యారేజ్ నిర్మాణ సంస్థ అయిన ఆప్కాన్స్, కాళేశ్వరంలోని మేడిగడ్డ, సుందిళ్ల , అన్నారం బ్యారేజీల పునరుద్ధరణ ఖర్చు అంతా ప్రభుత్వమే భరించాలని లేఖ రాశారని ఆయన తెలిపారు. బ్యారేజీలపై ఎన్డీఎస్ఏ సిఫార్సుల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తే రూ.40 కోట్ల వరకు ఖర్చు కావచ్చని, ఆ ఖర్చులు కూడా ప్రభుత్వమే భరించాలని గుత్తేదారులు తెలియజేయడం ప్రభుత్వం యొక్క అసమర్ధతకు నిదర్శనమని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, అవినీతిని కక్కిస్తామని, వృధా అయిన ప్రభుత్వ ధనాన్ని రికవరీ చేస్తామని ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తుంటే, ఇంకోవైపు గుత్తేదారు సంస్థలు ప్రభుత్వం నుంచి పునరుద్ధరణ ఖర్చులు కూడా రికవరీ చేస్తామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అన్నారం, సుందిళ్లలో ఫైనల్ బిల్లు రూ .176 కోట్లు , ఎన్డీఎస్ఏ సిఫార్సుల మేరకు చేసిన పనులకు రూ.4.5 కోట్లు ఇవ్వాలని, బ్యాంకు గ్యారంటీ మొత్తం రూ.43 కోట్లు కూడా ఇవ్వాలని గుత్తేదారు సంస్థ కోరినట్టు పత్రికల్లో వార్తా కథనాలు వచ్చాయన్నారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని వెలికితీయక పోగా పునరుద్దరణ ఖర్చు కూడా మొత్తంగా ప్రభుత్వం భరిస్తే రాష్ట్ర ప్రజల మీద ఇంకా భారం మోపినట్లు అవుతుందని ఎమ్మెల్యే హరీష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం లోని ఏడో బ్లాక్ పునర్నిర్మాణం, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల మరమ్మతుల కోసం ఎన్డీఎస్ ఏ నివేదిక ప్రకారం పనులు చేస్తే దాదాపు రూ.10 వేల కోట్లు అదనంగా ఖర్చయ్యే అవకాశం ఉందని, ఈ ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ఫైనల్ బిల్ ఇంకా ఆమోదం తెలపలేదని ఫైనల్ బిల్ చెల్లించడానికి ప్రభుత్వం తొందరపడద్దని కాళేశ్వరం పునరుద్ధరణ జరిగే వరకు ఈ బిల్లు ఆపాలన్నారు. సంవత్సరానికి 16 వేల కోట్లు సాగునీటి శాఖలో అప్పులు, వడ్డీలకు చెల్లించాల్సి వస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారని ఇటువంటి పరిస్థితుల్లో కాళేశ్వరం పునరుద్ధరణ ఖర్చు ప్రభుత్వం మీద పడితే రాష్ట్రం ఇంకా దివాళా తీసే అవకాశం ఉందని ఎమ్మెల్యే హరీష్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం అవినీతి పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, బాధ్యులైన ఆనాటి గుత్తేదారు సంస్థలు, ఆనాటి ప్రభుత్వంలో పెద్దల నుంచి రికవరీ చేయాలని భారతీయ జనతా పార్టీ శాసన సభా పక్షం తరపున డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. జ్యుడీషియల్ కమిషన్ విచారణకు కేసీఆర్, హరీష్ రావు హాజరవుతామని చెప్పలేకపోతున్నారని, గుమ్మడి కాయల దొంగా అంటే భుజాలు తడుముకున్నట్లు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

Leave A Reply

Your email address will not be published.