Take a fresh look at your lifestyle.

అంతర్గత కలహాల సాకుతోనే ఎమర్జెన్సీ

  • సీఎం రేవంత్ ఢిల్లీ కి సామంతుడు.
  • తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు.
  • బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.

ముద్ర ప్రతినిధి, నిర్మల్: గతంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాల సాకుతో దేశంలో  ఎమర్జెన్సీని విధించారని, అధికారం కాపాడుకునేందుకే ఈ నిర్ణయమని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు.దీనికి కారణం యుద్ధమో, తిరుగుబాటో కారణం కాదని, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తన ఎన్నిక రద్ధయిన తర్వాత అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న ఆరాటంతో ఈ ఎమర్జెన్సీని విధించారని ఆయన అన్నారు.కాగా ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఆయన ధ్వజమెత్తారు.నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.ఎమర్జెన్సీ చీకటి అధ్యాయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక సంస్థలను తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు.ఆ సమయంలో పత్రిక స్వేచ్ఛను, న్యాయాన్ని, పౌరుల హక్కులను సైతం అణచివేసారని మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీ తమ అధికారానికి ముప్పు వాటిల్లినప్పుడల్లా రాజ్యాంగానికి, జాతీయ సమైక్యతకు విఘాతం కలిగించడంలో వెనుకాడదని స్పష్టం అవుతోందన్నారు.ఎమర్జెన్సీ సమయంలో ఆర్టికల్ 352 దుర్వినియోగంతో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారన్నారు. పార్లమెంటును, న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. కేవలం ఒక వ్యక్తి అధికారం కోల్పోతాననే భయంతో యావత్ దేశాన్ని అంధకారంలోకి నెట్టారని అన్నారు. 50 ఏళ్ల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అదే తీరును కొనసాగించడం సరికాదన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇదే తరహా పాలన కొనసాగుతున్నట్లు తెలిపారు.ఈ రాష్ట్రంలో సైతం సీఎం రేవంత్ డిల్లీలోని కాంగ్రెస్ నాయకులకు సామంతునిలా వ్యవహరించడం సరికాదన్నారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, నిర్మల్ మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులు రావుల రాంనాథ్, సత్యనారాయణ గౌడ్, నిజామాబాద్ జిల్లా బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.