Take a fresh look at your lifestyle.

మానవ సంహారాన్ని తక్షణమే నిలిపివేయాలి

  • మావోయిస్టులతో బేషరతు చర్చలు జరపాలి.
  • 25 వేల మంది కేంద్ర సాయుధ బలగాలతో కర్రెగుట్టలపై కేంద్ర మారణహొమం.
  • ఆపరేషన్​ కగార్​ ను న్యాయస్థానాలు సుమోటాగా స్వీకరించి విచారించాలి.
  • కేంద్రానికి వామపక్ష, పౌర హక్కుల నేతలు డిమాండ్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఆపరేషన్ కగార్ పేరుతో  రాజ్యాంగానికి విరుద్దంగా కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న మానవ సంహారాన్ని తక్షణమే నిలిపివేసి మావోయిస్టులతో బేషరతు చర్చలు జరపాలని వామపక్ష, పౌర హక్కుల నేతలు డిమాండ్ చేశారు.మావోయిస్టులు శాంతి చర్చల కోసం ప్రతిపాదించిన ఆ తర్వాత ఒక్క దాడికీ పాల్పడలేదని చెప్పారు. రాజ్యాంగబద్దంగా ఎన్నికైన  కేంద్ర ప్రభుత్వం తక్షణమే వారిని శాంతి చర్చలకు పిలవాల్సింది పోయి అందుకు పూర్తి విరుద్దంగా వ్యవహరించిందని మండిపడ్డారు. 25 వేల మంది కేంద్ర సాయుధ బలగాలతో కర్రెగుట్టలను అష్ట దిగ్భందనం చేసి ఆదివాసీల హనననాకి వ్యూహా రచనలు చేయడం దుర్మార్గమని ఆగ్రహాం వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో బేషరతుగా శాంతి చర్చలు జరపడంతో పాటు ఆదివాసీలను హననం చేసే ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలి అని డిమాండ్  చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ బషీర్ దేశోద్దారక భవన్ లో రాష్ట్ర సదస్సు జరిగింది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి,ఎంఎల్ఏ కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ రాష్ట్ర సదస్సులో  ఆ పార్టీ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జస్టిస్ బి.చంద్ర కుమార్,సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ,సీపీఐఎం ఏల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య,సీపీఐ ఎంఎల్ మాస్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు  కె.జి.రాంచందర్, ఎంసిపిఐ (యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి ప్రసాదన్న, ఆర్ ఎస్ పి రాష్ట్ర కార్యదర్శి ఎ.జానకిరాములు, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి  రాజా రమేష్ , ఎస్ (కమ్యూనిస్టు) రాష్ట్ర కార్యదర్శిసి సిహెచ్.మురహరి, పార్వర్డ్ బ్లాక్ నాయకులు ప్రసాద్, సీపీఐన్యూడెమోక్రసీ నాయకులు విశ్వనాధ్, అరుణోదయ నాయకురాలు విమలక్క ప్రసంగించారు.ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ దేశ పౌరులైన మావోయిస్టులను తేదీ,సమయం నిర్ధేశించి  మరీ సంహరిస్తామని ప్రకటించే హక్కు కేంద్ర  హోంమంత్రి అమిత్ ఎవరిచ్చారని  ప్రశ్నించారు.ప్రజలు ఎవరైనా తప్పు చేస్తే వారిని రాజ్యాంగబద్దంగా ఏర్పడిన చట్టాల ప్రకారం  శిక్షించాలే తప్ప  కాల్చి చంపే అధికారం ఏ ఒక్కరికీ లేదని ఆయన స్పష్టం చేశారు.రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యల ద్వారా ప్రజలకు  ఏమి చెప్పాలకుంటున్నదని నిలదీశారు.గతంలో  రాజీవ్ అత్యంత దారుణంగా చంపిన వారికే  క్షమాభిక్ష పెట్టాలని ఆయన  కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె  ప్రియాంక గాంధీ మానత్వంతో కోరారని సాంబశివరావు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం అత్యంత దుర్మార్గంగా మావోయిస్టులను చంపుతోందని మండిపడ్డారు.అసలు వారి ఎజెండా ప్రశ్నించే వారిని చంపడమేనా  అని నిలదీశారు.ఈ దేశ ప్రజల హితం కోరే కమ్యూనిస్టుల ప్రతి ప్రకటన కోట్లాది మంది ప్రజలను కదిలిస్తుందనీ ఆలోచింపజేస్తుందన్నారు. అందుకే ఈ భావాజాలమంటే పాలకులకు భయమని కూనంనేని పేర్కొన్నారు. దేశ  పరిస్థితులు పూర్తిగా విభిన్నమైనవని, ఇది శాంతి, సామరస్యాన్ని కోరుకునే దేశమని, అందుకు అనుగుణంగా  వచ్చిన రాజ్యాంగం ప్రకారమే ప్రజాస్వామ్యం ఏర్పడిందన్నారు. ఇతర దేశాలతో యుద్దం జరిగే క్రమంలో కూడా యుద్దనీతి అనేది ఒకటి ఉంటుందని చెప్పారు.కానీ కేంద్ర ప్రభుత్వం ఈ దేశ పౌరులపైనే యుద్దం ప్రకటించి వారిని  అత్యంత దారుణంగా వేటాడి వెంటాడి కాల్చి చంపే హక్కు వారికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ఈ ఘటనలను  న్యాయస్థానాలు సుమోటాగా స్వీకరించి న్యాయ విచారణ  చేపట్టాలని కోరారు. గతంలో హిట్లర్, ముసోలీని సైతం తామే శాశ్వతంగా ఉంటామని ఇలాగే విర్రవీగి కాలగర్భంలో కలిసిపోయారని గుర్తు చేశారు. ఇప్పడు బిజెపి పాలకులు తామే శాశ్వతమని అనుకుంటున్నారన్నారు.ప్రజాస్వామ్యంలో  ప్రజలు, చట్టాలు మాత్రమే శాశ్వతమని, అవే  శక్తివంతమని ఫాసిస్టు బీజేపీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని సూచించారు. మావోయిస్టులు అనుసరిస్తున్న రాజకీయ పంథాకు ఇది సరైన సమయం గాని, ప్రస్తుతం దేశంలో ఆలాంటి పరిస్థితులు లేవని, దీనిని వారు కూడా ఆలోచించాలని  కోరారు.అసలు ఎర్రజెండాలన్నీ కలిసి ఒకే జెండా ఏర్పడితే  ఆనాటి రాజ్యం మనదేనని, మనమంతా  కోరుకుంటున్న సమసమాజం ఏర్పడుతుందని సాంబశివరావు అన్నారు.ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ ప్రజాస్వామిక దేశంలో మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని వామపక్షాలు ఏకతాటిపైకి రావడం చారిత్మ్రాక ఘట్టమని అన్నారు. మావోయిస్టుల రాజకీయ పంథాపై అన్ని పార్టీలకు విభిన్నాభిప్రాయాలు ఉండోచ్చన్నారు.కానీ రాజ్యాంగంపై  ప్రమాణం చేసిన  హోంమంత్రే  మావోయిస్టులను ఏరివేస్తామని,సమయాన్ని,సంవత్సరాన్ని నిర్ణయించి ఆప్రజాస్వామికంగా కగార్ ఆపరేషన్ కొనసాగించడం గర్హనీయమన్నారు.దేశంలో అనేక  సందర్చాలలో శాంతి చర్చలు జరిగాయన్నారు. ఇతర దేశాల్లో వేర్పాటు ఉద్యమం సమయంలోనూ చర్చలు జరిగాయి,కానీ దేశంలో మావోయిస్టులనే కాకుండా ప్రజాస్వామికవాదులను, నక్సలైట్ల పేరుతో ఆదివాసీలను పూర్తిగా నిర్మూలించేందుకు నిరంకుశ బీజేపీ ప్రభుత్వం పెద్దఎత్తున  దమనకాండ  కొనసాగిస్తోందని ఆగ్రహాం వ్యక్తం చేశారు.ఎన్ కౌంటర్ పేరుతో  ఒక్కసారిగా  పదుల సంఖ్యలో మావోయిస్టులను చంపేయడం, వారి చుట్టూ  పోలీసులు నృత్యాలు చేయడం చూస్తుంటే ఇది ప్రజాస్వామిక దేశామేనా అనే ఆవేదన కలుగుతోందన్నారు. ఇలాంటి  ఘటనలను ఖండిస్తూ వామపక్షాలే  కాకుండా కలిసివచ్చే అన్ని శక్తులతో విశాల వేదిక ఏర్పాటు చేసుకుని  కేంద్ర ప్రభుత్వ విధానాలపై  ఆవిశ్రాంత ఉద్యమం కొనసాగించాలని సత్యం పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.