ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం క్షేత్రస్థాయి ఆకస్మిక తనిఖీలో అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం
(ముద్ర, ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ప్రతినిధి):
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులను కొనసాగిస్తూ పెండింగ్ పైళ్లను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సిరిగిరిపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం, ప్రాథమిక పాఠశాల, మహేశ్వరం ప్రధాన రహదారి శుభ్రత పనులను ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించడం జరిగినది .ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయ కార్యకలాపాలను సమీక్షించి, స్థానిక పరిపాలనను మెరుగుపరచడానికి చర్చించారు. ప్రాథమిక పాఠశాల సౌకర్యాలను పరిశీలించి, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులతో సంభాషించారు. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా మహేశ్వరం ప్రధాన రహదారిలో శుభ్రత పనుల పురోగతిని సమీక్షించారు. తహశీల్దార్ కార్యాలయంలో ఎటువంటి ఫైల్ పెండింగులో లేకుండా మార్చ్ 16వ తేదీ వరకు పరిష్కరించాలని సూచించారు. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు బోధిస్తున్న విధానాన్ని పరిశీలించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 12వ తేదీ వరకు గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో 99 రోజుల పాటు కార్యచరణ అమలు చేయాలని, పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అదే విధంగా కార్యాలయాలలో పెండింగ్ లో ఉన్న పైళ్లను పూర్తిగా పరిష్కరించాలని తెలిపారు. అధికారులు వారి పరిధిలోని అంశాలను దశల వారీగా పూర్తి చేయాలని తెలిపారు. వేసవి దృష్ట్యా త్రాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. రోడ్లపైన చెత్త లేకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సేకరించిన చెత్తను ఎప్పటికప్పుడు తరలించాలని సూచించారు.
కలెక్టర్ వెంట కందుకూర్ ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, ఎంపీవో రవీందర్ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.