Take a fresh look at your lifestyle.

పెట్రోల్, డిజీల్ కొరతపై ఆందోళన వద్దు-రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

 
రాష్ట్రంలో రెండు నెలలకు సరిపడా నిల్వలున్నాయి
కమర్షియల్ గ్యాస్ కొరతపై కేంద్రంతో చర్చలు జరుపుగుతున్నాం

ముద్ర, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రెండునెలలకు సరిపడా నిల్వలున్నాయని వెల్లడించారు. పెట్రోల్, డీజిల్ లభ్యతపై ఆందోళన చెందవద్దని ప్రజలకు సూచించారు. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద వాహనాల రద్దీ అమాంతం పెరిగింది. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్ లో అయితే పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఫుల్ ట్యాంకులు చేయించుకోవడమే కాక.. డ్రమ్ములు, క్యాన్లు, కంటైనర్లలోనూ పెట్రోల్, డీజిల్ ను నింపుకుంటున్నారు. అవసరానికి మించి కొనుగోలు చేస్తుండటంతో బంకుల్లో ఇంధనం నిండుకుని నో స్టాక్ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం ప్రకటన విడుదల చేశారు. పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టవద్దని సూచించారు. రాష్ట్రంలో రెండు నెలలకు సరిపడా ఇంధన నిల్వలున్నాయని స్పష్టం చేశారు. డ్రమ్ములు, కంటైనర్లలో పెట్రోల్ నింపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే వాణిజ్య గ్యాస్ కు కొంత ఇబ్బంది ఉందన్నది వాస్తవమేనని చెప్పారు. దీనిపై కేంద్రంతో చర్చలు జరుపుతున్నామని వివరించారు. హైదరాబాద్ లో కొందరు పుట్టించిన పుకార్ల కారణంగానే ఈ పరిస్థితి నెలకొందన్నారు.

సరఫరా ఆగలేదు : తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్
రాష్ట్రంలో ఇంధన కొరత ఏ మాత్రం లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. కొరత ఉందనే పుకార్లతో ప్రజలు అనవసరంగా బంకుల వద్ద క్యూ కడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం హెచ్ పీ సీఎల్,, ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్ వంటి కంపెనీల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని బుధవారం ప్రకటనలో తెలిపింది. సరఫరా గొలుసు ఎక్కడా ఆగలేదన్న అసోసియేషన్.. కొరత ​భయంతో ప్రజలు ఒక్కసారిగా కొనుగోలు చేయడంతో సాధారణం కంటే 2.5 నుండి 3 రెట్లు విక్రయాలు పెరిగాయన్నారు. ఫలితంగా కొన్ని బంకుల్లో తాత్కాలికంగా స్టాక్ అయిపోవచ్చని అభిప్రాయపడింది. అంతే తప్ప ఎక్కడా కొరత లేదన్నారు. పెట్రోల్ లేదా డీజిల్‌ను డబ్బాల్లో, క్యాన్లలో నింపి నిల్వ చేయడం పెస్కో నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. ఇది చాలా ప్రమాదకరమనీ అగ్ని ప్రమాదాలకు దారి తీయవచ్చని హెచ్చరించింది. ​ప్రజలు తమకు అవసరమైనంత మేరకే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని, అనవసరంగా నిల్వ చేయవద్దని అసోసియేషన్ కోరింది.

Leave A Reply

Your email address will not be published.