కోరుట్ల, ముద్ర విలేకరి: రెండవ షిర్డీగా పేరొందిన కోరుట్ల పట్టణంలోని శ్రీ సాయిరామ దేవాలయంలో గురువారం రోజు గురు (వ్యాస) పౌర్ణమి సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ఉదయం సాయి బాబా విగ్రహానికి సుప్రభాత సేవతో మేల్కొలిపి పంచామృతాలతో అభిషేకించి, రంగురంగుల పూలతో అలంకరించారు. గోపూజ, అర్చన, హోమం, ధునిశాల ప్రవేశం, మధ్యాహ్న హారతి అనంతరం ఆలయం చుట్టూ పల్లకి సేవ నిర్వహించగా భక్తుల భజనలు ఆహుతులను అలరించాయి. ఈ మహోత్సవంలో కోరుట్ల, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు, నూతనంగా ఎన్నికైన టియూడబ్ల్యూజె జిల్లా అధ్యక్షులు చీటి శ్రీనివాస్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పౌర్ణమి, గురువారం కలిసి రావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి విచ్చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని జువ్వాడి నర్సింగ రావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బాలే ప్రసాద్, ధర్మకర్తలు నేమూరీ భూమయ్య, నాగ భూషణం, అరవింద్, కిరణ్, ఆలయ కార్యనిర్వహణాధికారి కే.కాంతరెడ్డి, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
