Take a fresh look at your lifestyle.

రాష్ట్ర సమగ్రాభివృద్ధే సర్కార్ లక్ష్యం

  • రాష్ట్ర ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే సోనియా ఆకాంక్ష.
  • పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆకాంక్షలు ఆవిరయ్యాయి.
  • ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అంకితం.
  • సబ్ ప్లాన్​ నిధుల కేటాయింపుతో పాటు ఖర్చుపైనా దృష్టి.
  • గత ప్రభుత్వంలో మిగిలిపోయిన సబ్ ప్లాన్ నిధులు క్యారీ ఫార్వర్డ్ చేశాం.
  • గతంలో పంచిన అసైన్డ్ భూములు వెలికి  తీస్తాం.
  • అన్ని వర్గాల విద్యార్ధుల భవిష్యత్తుకు ప్రజా ప్రభుత్వం కృషి.
  • వారి కోసం ఎన్ని నిధులైన ఖర్చు చేస్తాం. 
  • ఎస్సీ గురుకులాల విద్యార్థులకు అవార్డుల పంపిణీలో డిప్యూటీ సీఎం భట్టి.

ముద్ర, తెలంగాణ బ్యూరో : సామాజిక తెలంగాణ,రాష్ట్ర సమగ్రాభివృద్ధితో పాటు ఈ ప్రాంత ప్రజలు ప్రజల ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన పదేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం.. వాటిని సాధనకు కృషి చేస్తోందన్నారు. బుధవారం బంజారా భవన్లో ఏర్పాటు చేసిన ఎస్సీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యార్థులకు ప్రోత్సాహకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వచ్చిన అధికారాన్ని బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆదాయం ఎంత, ఖర్చు ఎలా ఉంది అన్ని బేరీజు వేసుకొని ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్తున్నామన్నారు. భవిష్యత్తులో మరిన్నిపథకాలు,  కార్యక్రమాలు తీసుకురాబోతున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఎస్టీ, ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారం నిధులు కేటాయించడంతో పాటు వాటిని ఆయా పనులకు ఖర్చు చేస్తున్నామన్నారు. ప్రభుత్వంలో ఖర్చు చేయకుండా మిగిలిపోయిన సబ్ ప్లాన్ నిధులను సీఎం క్యారీ ఫార్వర్డ్ చేశారని గుర్తు చేశారు. సబ్ ప్లాన్ నిధులకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రం, గత పదేళ్లు పాలించిన వారి చరిత్రకు భిన్నంగా రాష్ట్రంలో సబ్ ప్లాన్ నిధుల ఖర్చు జరుగుతుందని డిప్యూటీ సీఎం వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో తాను డిప్యూటీ స్పీకర్ గా ఉన్న సమయంలోనే సబ్ ప్లాన్ చట్టాన్ని పాస్ చేశానని చెప్పారు. గత పదేండ్లు సీఎల్పీ నేతగా సబ్ ప్లాన్ చట్టం నిధులపై ప్రతి బడ్జెట్ సమావేశంలో మాట్లాడానన్నారు. గత పాలకులు సబ్ ప్లాన్ నిధులను పూర్తిగా గాలికి వదిలేశారన్న ఆయన తమ ప్రభుత్వంలో ఎస్సీ సబ్ ప్లాన్ కింద రూ. 40,232 కోట్ల కేటాయింపుతో పాటు గత ప్రభుత్వంలో ఖర్చు చేయని రూ. 13,223 కోట్ల నిధులను క్యారీ ఫార్వర్డ్ చేశామన్నారు. ఎస్టీ సబ్ ప్లాన్ కోసం రూ.17,169 కోట్లు కేటాయించడంతో పాటు గతంలో ఖర్చు చేయని రూ. 1296 ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను క్యారీ ఫార్వర్డ్ చేసి ఆ నిధులు పక్కకు పోకుండా ఖర్చు చేస్తున్నామని తెలిపారు. మాటలు చెప్పి అధికారాన్ని హోదాగా అనుభవించి బతకాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని తెలిపారు.వెనకబడిన విద్యార్ధులను ఆర్థికంగా సామాజికంగా ప్రోత్సహించాలన్న ప్రజా ప్రభుత్వ తపన ఈ అవార్డుల ప్రధాన ఉత్సవం కార్యక్రమంతో స్పష్టమవుతుందని డిప్యూటీ సీఎం అన్నారు.

మన రాష్ట్ర బిడ్డలు ఈ రాష్ట్రానికే కాకుండా దేశానికి ప్రపంచానికి మార్గదర్శకంగా ఎదగాలని ఆకాంక్షించారు. గతంలో పంచిన అసైన్డ్ భూములను వెలికి తీసి పేదలకు పంచాలన్న ఆలోచనలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని వివరించారు. ఒకే సంవత్సరంలో దాదాపు 100కు పైబడి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ను మంజూరు చేశామనీ ఒక్కో పాఠశాలను రూ. 200 కోట్లతో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నామన్నారు. ప్రపంచంలోనే ఏ ప్రైవేట్ పాఠశాలకు తగ్గకుండా ఓ సువర్ణ అధ్యాయాన్ని సృష్టించాం అని డిప్యూటీ సీఎం తెలిపారు.పదేండ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన గత పాలకులు నిరుద్యోగులను గాలికి వదిలేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. దాంతో ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు ఉద్యోగాలు లేక ఫంక్షన్స్ లో సప్లయర్లుగా పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితిని నివారించేందుకు తమ ప్రభుత్వం అధికారుల్లోకి రాగానే 56 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. మరో 36వేల ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ చేపట్టిందన్నారు. వీటితోపాటు నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించి ఆర్థికంగా ప్రోత్సహించేందుకు రూ. 8వేల కోట్లతో ఐదు లక్షల మంది యువతకు చేయూతను అందించేందుకు రాజీవ్ యువ వికాసం పేరిట స్వయం ఉపాధి పథకాన్ని జూన్ రెండు నుంచి అమలు చేయబోతున్నట్టు డిప్యూటీ సీఎం ప్రకటించారు. అటవి హక్కుల చట్టం ప్రకారం దక్కిన భూములను దున్నుకోవడానికి వెళ్లిన గిరిజన మహిళలను గత ప్రభుత్వం చెట్టుకు కట్టేసి కొట్టిందని డిప్యూటీ సీఎం ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అటవీ హక్కుల చట్టం కింద గిరిజనులకు దక్కిన 6.70 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చేందుకు ఇందిరా సౌర గిరి జలవికాసం అనే పథకాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ పథకం కింద గిరిజన రైతులకు ఉచితంగా పంపుసెట్లు, సోలార్ ప్యానల్స్, డ్రిప్పు, స్ప్లింకర్లు, ఉద్యాన శాఖ ద్వారా అవకాడో, వెదురు వంటి పంటలను ఉచితంగా గిరిజన రైతుల ద్వారా సాగు చేయిస్తున్నామన్నారు. ఇందిరా సౌరగిరి జిల్లా వికాసం కోసం రూ.12,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని భట్టి వివరించారు.

Leave A Reply

Your email address will not be published.