Take a fresh look at your lifestyle.

నాట్లు వేయకముందే రైతు భరోసా

  • ధాన్యం విక్రయించిన రైతులకు మూడు, నాలుగు రోజుల్లోనే డబ్బులు జమా.
  • రాష్ట్రం అప్పుల్లో ఉన్నా రైతు సంక్షేమానికి పాటుపడుతున్నాం.
  • రైతులు ఆయిల్ ఫామ్ సాగుతో లాభాలు పొందాలి.
  • ఇది రైతులను ఆర్థికంగా,స్థిరంగా నిలబెడుతుంది.
  • చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి తుమ్మల.

ముద్ర, తెలంగాణ బ్యూరో : వచ్చే వ్యవసాయ సీజన్లో రైతులు నాట్లు వేయకముందే వారి ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. ధాన్యం విక్రయించిన రైతులకు మూడు, నాలుగు రోజుల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమా చేస్తున్నట్లు చెప్పారు. రైతులను కాపాడుకుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పారు. అందుకే తమ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తోందన్నారు. బుధవారం చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం అధ్యక్షతన జరిగిన సభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ నూతన రాష్ట్రంగా ఉన్నప్పటికీ, అప్పుల ఊబిలో కూరుకుపోయినప్పటికీ రూ.33వేల కోట్ల నిధులను రైతుల ఖాతాలో జమా చేశామని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 2 లక్షల 83 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి సేకరించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు.

  • ఆయిల్ ఫాం సాగుపై దృష్టి పెట్టండి.

రైతులను ఆర్థికంగా,స్థిరంగా నిలబెట్టే పంట ఆయిల్ ఫామ్ అని మంత్రి తుమ్మల చెప్పారు. నీటి అవసరం అంతగా అవసరం లేని ఈ పంటసాగుపై దృష్టి సారించాలని రైతులకు సూచించారు. తర్వాత హార్టికల్చర్ పంటలపై కూడా దృష్టి సారించి లాభాలను అర్ధించాలన్నారు.రైతులు ముందస్తు అవగాహనతో కాలానుగుణంగా పంటలు సాగు చేసి వృద్ధి చెందాలని సూచించారు. అందులో భాగంగానే నల్గొండ జిల్లాలో ఆయిల్ ఫామ్ తోటలను సాగు చేసి వృద్ధిలోకి రావాలన్నారు. నల్గొండలో ఆయిల్ ఫామ్ తోటల సాగు రోజురోజుకు పెరుగుతున్నందున త్వరలోనే ఆ జిల్లాలో ఆయిల్ ఫామ్ కంపెనీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల భరోసా ఇచ్చారు. మాజీ సీఎం ఎన్టీ రామారావు ప్రోద్బలంతోనే తాను ఆయిల్ ఫామ్ తోటలను సాగు చేశానని మంత్రి గుర్తు చేశారు. ఇప్పటికీ ఆయిల్ ఫామ్ తోటలను సాగు చేస్తూ లాభాలను అర్జిస్తున్నానని చెప్పారు. ఈ మధ్య శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఆయిల్ ఫామ్ తోటల సాగును చేపట్టారన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా ఆయిల్ ఫామ్ తోటలను సాగు చేసి రైతులకు ధైర్యం, భరోసా ఇవ్వాలన్నారు.

  • చిట్యాల వ్యవసాయ మార్కెట్ పరిధిలోకి ఎనిమిది గ్రామాలు.

చిట్యాల మండలానికి సంబంధించిన ఎనిమిది గ్రామపంచాయతీలు చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఉండడంతో చిట్యాల వ్యవసాయ మార్కెట్ కు ఆదాయం రాకుండా పోతుందని మంత్రి తుమ్మల అభిప్రాయపడ్డారు. త్వరలోనే ఎనిమిది గ్రామాలను కూడా చిట్యాల వ్యవసాయ మార్కెట్ పరిధిలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే నార్కెట్పల్లి మండలంలో సబ్ మార్కెట్ యాడ్ ఏర్పాటుకు కృషి చేస్తాననీ భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో రైతులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని చెప్పారు. వాటన్నింటిని అధిగమించి రైతుల్లో ఆనందాన్ని చూసే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. రైతులందరూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, తెలంగాణ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ నర్ర వినోద మోహన్ రెడ్డి, చిట్యాల పిఎసిఎస్ చైర్మన్ మల్లేష్ గౌడ్, కనకదుర్గ ఆలయ చైర్మన్ మారగోని ఆంజనేయులు, మున్సిపల్ మాజీ చైర్మన్ చిన్న వెంకటరెడ్డి, డిసిసి కార్యదర్శి పోకల దేవదాస్, జడల చిన్న మల్లయ్య పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.