Take a fresh look at your lifestyle.

రగిలిన భూ పోరాటం

  • రణరంగమవుతున్న హెచ్‌సీయూ.
  • భూమి మాదంటూ మాదని వాదన.
  • 400 ఎకరాలను అమ్మేందుకు సర్కారు సిద్ధం.
  • వదులుకోలేమంటూ బైఠాయిస్తున్న విద్యార్థులు.
  • భూములపై సర్వే చేయలేదన్న హెచ్​సీయూ.
  • అమ్మాలంటే ఎగ్జిక్యూటి కమిటీ వేయాల్సిందేనన్న యూనివర్సిటీ.
  • ఇప్పటికే వందల ఎకరాలను తీసుకున్న ప్రభుత్వాలు.
  • ఇప్పుడు ఇంచు కూడా అమ్మనీయమంటూ ఆందోళన.
  • మొండిగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం.
  • తామూ తగ్గమంటున్న విద్యార్థులు, విపక్షాలు.
  • మద్దతుగా నిలుస్తున్న బీజేపీ, బీఆర్​ఎస్​.
  • విక్రయాలు వద్దన్న మావోయిస్టు పార్టీ.

ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిపై వివాదం రాజుకుంటున్నది. విద్యార్థుల ఆందోళనలు, పోలీసుల లాఠీఛార్జ్‌తో విశ్వ విద్యాలయం రణరంగంగా మారింది. ఇప్పుడు యూనివర్సిటీ మొత్తం పోలీసులతో నిండిపోయింది. ఇప్పుడు ఈ భూములపై పెద్ద సమస్యే మొదలైంది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పరిధిలోని భూములను విక్రయానికి పెడుతున్నారనే కారణంగా విద్యార్థులు భూ పోరాటానికి దిగారు. అక్కడి 400 ఎకరాలను ప్రభుత్వం అమ్మకానికి పెట్టడంతో భూ వివాదం రాజుకున్నది. దీంతో విశ్వ విద్యాలయం రణరంగంగా మారింది. విద్యార్థుల నినాదాలు, ఆందోళనలు.. పోలీసుల లాఠీ దెబ్బలతో హెచ్‌సీయూ ప్రాంతం దద్దరిల్లింది. దీనిపై ఇటు విద్యార్థులు అటు ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో యూనివర్సిటీ మొత్తం పోలీసుల వలయంలో చిక్కింది. తాజాగా విద్యార్థులపై లాఠీచార్జ్‌ చేయడంతో.. భూముల లొల్లి ముదిరిపోయింది. అటు విపక్షాలు సైతం విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. బీజేపీ ఎంపీలు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర మంత్రుల్లో కీలకమైన ఇద్దరు హెచ్‌సీయూ పూర్వ విద్యార్థులే కావడంతో.. వారిపై విద్యార్థుల డిమాండ్‌ పెరిగిపోయింది. మొత్తంగా సెంట్రల్‌ యూనివర్సిటీ భూ పోరాటాలతో హీటెక్కింది.ఇక, ఈ భూముల వ్యవహారంపై ఇప్పటిదాకా సైలెంట్​గా ఉన్న హెచ్​సీయూ కూడా దీనిపై స్పందించింది. ఒక విధంగా భూముల అమ్మకానికి ప్రభుత్వానికి ఏం అధికారం అంటూ ప్రశ్నించింది. ఇప్పటి వరకు ఎలాంటి సర్వే చేయలేదని హెచ్​సీయూ తేల్చింది. మరోవైపు ఈ భూములు తమవేనని, తాము విక్రయానికి పెట్టిన 400 ఎకరాల్లో హెచ్​సీయూ స్థలం ఇంచు కూడా లేదని ప్రభుత్వం తరపున టీజీఐఐసీ వెల్లడించింది. ఈ వివాదంపై ఇటు రాజకీయ పక్షాలతో పాటుగా మావోయిస్టు పార్టీ కూడా స్పందించింది. నిజానికి, ఈ భూముల వ్యవహారంపై గత కొంత కాలంగా విద్యార్దులు ఆందోళనలు చేస్తున్నారు. యూనిర్సిటీ క్యాంపస్ లోపలే ప్రతీ రోజూ నిరసనలు తెలుపుతున్నారు. తాజాగా నిరసనలు తారాస్దాయికి చేరాయి. తాజాగా ఆదివారం జేసీబీలు క్యాంపస్ లోపలికి రావడం, వివాదాస్పద భూముల్లో చెట్లను తొలగించేందుకు సిద్దమవ్వడంతో విద్యార్దులు అడ్డుకున్నారు. విద్యార్ది సంఘాల ఆధ్వర్యంలో భారీగా చేరుకున్న విద్యార్దులు జేసిబిలను వెనక్కు పంపే ప్రయత్నం చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. విద్యార్దులను బలవంతంగా అదుపులోకి తీసుకోగా.. ఈ వివాదంలో లాఠీఛార్జీ కూడా చేశారు.

  • వివాదం ఇది

ఈ వివాదంలో బీఆర్‌ఎస్, బీజేపీ, వామపక్షాల నాయకులు కూడా హెచ్‌సీయూ విద్యార్థులకు మద్దతుగా నిలుస్తున్నారు. హెచ్‌సీయూలో వర్సిటీ భూములను ఏదో ఒక సాకుతో ప్రభుత్వం వెనక్కి లాక్కుంటోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. వర్సిటీ ఏర్పడ్డాక దాదాపు 50 ఏళ్లలో 500 ఎకరాల భూమిని లాక్కున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. 2300 ఎకరాల్లో హెచ్‌సీయూను ఏర్పాటు చేయగా.. ఇప్పడు యూజీసీ లెక్కల ప్రకారం 1800 ఎకరాలు మాత్రమే ఉందని, మళ్లీ ఇప్పుడు టీజీఐఐసీ ద్వారా 400 ఎకరాలను వేలం వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో విద్యార్థి సంఘాలు, వర్కర్లు, టీచింగ్, నాన్‌టీచింగ్‌ సిబ్బంది ఆందోళనకు దిగారు. అయితే ఈ స్థలం హెచ్‌సీయూది కాదని.. కోర్టు ఇచ్చిన తీర్పు మేరకే 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి అప్పగించినట్లు ప్రభుత్వం చెప్పింది. ఇది పూర్తయితే హెచ్‌సీయూలో ఇక మిగిలేది 1400 ఎకరాలు మాత్రమే. హెచ్‌సీయూ పూర్వ విద్యార్థులైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్‌ బాబు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, హెచ్‌సీయూ భూములు వర్సిటీకే చెందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హెచ్‌సీయూ చుట్టూ ఐటీ కారిడర్ ఉండటం వల్ల ఈ భూములను విక్రయిస్తే భారీగా ఆదాయం వచ్చే ఛాన్స్ ఉందని, ఈ 400 ఎకరాలను విక్రయిస్తే దీని మార్కెట్‌ విలువ ప్రకారం రూ.10 వేల కోట్లు వస్తుందని ప్రభుత్వం అంచనా వేసినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

  • ప్రభుత్వం ఏం చెప్తున్నది..?

విద్యార్థుల ఆందోళన, విపక్షాల మద్దతుతో ఈ భూముల వ్యవహారం భగ్గుమంటున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ 400 ఎక‌రాల భూమి ప్రభుత్వానిదేనని, ప్రాజెక్టులో సెంట్రల్ యూనివ‌ర్సిటీ భూమి లేదని వివరణ ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం కంచె గ‌చ్చిబౌలిలోని 400 ఎక‌రాలపై యాజ‌మాన్యం త‌న‌దేన‌ని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. తాము తీసుకున్న ప్రాజెక్టులో హెచ్‌సీయూ భూమలు లేవని తెలిపింది. 21 ఏళ్ల క్రితం ప్రైవేటు సంస్థలకు కేటాయించిన భూమిని న్యాయపోరాటం ద్వారా దక్కించుకున్నట్లు వివరించింది. అనవసరంగా విద్యార్థులను తప్పుదోవ పట్టించొద్దని, వేలం, అభివృద్ధి పనులు అక్కడి రాళ్లను దెబ్బతీయవని హామీ ఇచ్చింది.

  • వివాదాస్పద భూముల్లో ప్రభుత్వ ప్లాన్‌ ఏమిటీ

గత ఏడాది సుప్రీం కోర్టు తీర్పుతో భూములపై హక్కులు సొంతం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం 2024 జూన్ 26న టిజిఐఐసికి ఈ భూములు కేటాయిస్తూ రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ భూముల్లో పికాక్ లేక్ , బఫెలో లేక్ వంటివి లేవని స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ 400 ఎకరాల భూముల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుతో పాటు ప్రపంచస్దాయి మౌళిక సదుపాయాలు కల్పించేందుకు సిద్దమైయ్యింది. ఈ భూమిని అమ్మి వేల కోట్లు రాబట్టుకునేందుకు ప్లాన్ చేసింది. కానీ, ఇక్కడి విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రతిపక్షాలు మాత్రం విద్యార్దుల ఆందోళనలకు మద్దతు తెలుపుతున్నాయి. కేంద్రం దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతోపాటు విద్యార్దుల డిమాండ్ రాష్ట్రం ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలిని కోరుతున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం ఎవరెలా స్పందించినా మేము మాత్రం భూముల విషయంలో వెనక్కు తగ్గబోమంటూ తేల్చి చెప్పేస్తోంది.

  • ఎలాంటి సర్వే చేయలేదు : హెచ్​సీయూ

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకంపై మొదటిసారి యూనివర్సిటీ యాజమాన్యం స్పందించింది. గచ్చిబౌలి భూములపై హెచ్‌సీయూ రిజిస్ట్రార్ సోమవారం కీలక ప్రకటన చేశారు. వర్సిటీకి కేటాయించిన భూములను వేలం వేయాలన్నా, అమ్మాలనన్నా ఎగ్జిక్యూటి కమిటీ వేయాల్సిందే అని హెచ్​సీయూ తెలిపింది. భూములు అమ్మడానికి తాము అంగీకరించలేదని యూనివర్సిటీ యాజమాన్యం చెప్పుకొచ్చింది. అలాగే యూనివర్సిటీ భూముల హద్దులను నిర్ణయించడానిక యాజమాన్యం అంగీకరించలేదని, ఆ ప్రాంతం పర్యావరణం, జీవవైవిద్యాన్ని పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపింది. 2024 జూలై‌లో అక్కడ ఎలాంటి సర్వే నిర్వహించలేదని హెచ్‌సీయూ రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ భూమి ఎలా ఉందని ప్రాథమిక పరిశీలన మాత్రమే చేశారని తేల్చిచెప్పారు. హద్దులు అంగీకరించినట్లు టీజీఐఐసీ చేసిన ప్రకటనను ఖండించారు. ఇప్పటి వరకూ భూమి సరిహద్దులు గుర్తించలేదని అన్నారు. ఈ విషయంపై హెచ్‌సీయూకు సమాచారం ఇవ్వలేదని రిజిస్ట్రార్​వెల్లడించారు. భూమిని కేటాయించడంతో పాటు పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని కాపాడాలని మరోసారి కూడా ప్రభుత్వాన్నికోరతామని తెలిపారు. ఇటీవల పత్రికల్లో వచ్చిన టీజీఐఐసీ ప్రకటనను కూడా ఖండించారు. యూనివర్సిటీ భూమిని అన్యాక్రాంతం చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. పర్యావరణం, జీవవైవిధ్యాన్ని పరిరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. యూనివర్సిటీకి కేటాయించిన భూమిని బదిలీ చేయాలి అంటే విశ్వవిద్యాలయం కార్యనిర్వాహక మండలి అధికారిక సమ్మతితోనే జరుగుతుందని హెచ్‌సీయూ రిజిస్ట్రార్ స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.