ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో శ్రీ అష్టలక్ష్మి మండపంలో శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పంచామృతములు, పసుపు, సుగంధ ద్రవ్యాలతో వేదమంత్రోచ్ఛారణలతో వసంతోత్సవ సేవను శోభాయ మానంగా నిర్వహించారు.

శ్రీ స్వామి వారికి సహస్ర నామార్చన సేవ, లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనం, విశ్వేశ్వరుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి అర్చక స్వాములు స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీవారి వైభవోత్సవ మండపంలో వేదమంత్రాలతో మంగళ ధ్వనుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. అన్న ప్రసాద వితరణలో భాగంగా సుమారు 5000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్రదీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు.
స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో శనివారం సందర్భంగా జల నారాయణ స్వామి వారికి మంగళహారతులు సమర్పించారు.