Take a fresh look at your lifestyle.

హైదరాబాద్ లో కంపించిన భూమి.భయంతో బయటికి పరుగులు పెట్టిన జనం

 
గాజులరామారంలోని మెట్‌ఖాన్‌గూడా భారీ శబ్దంతో భూకంపం
ముద్ర, హైదరాబాద్ :
హైదరాబాద్‌లో భూమి కంపించింది. దీంతో జనం భయంతో పరుగులు తీశారు. భారీ శబ్దంతో భూమి కంపించినట్లు అనిపించడంతో.. స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. నగరంలోని గాజురామారంలో భూమి కంపించినట్లు అక్కడి ప్రజలు పేర్కొన్నారు. అయితే ఇది భూకంపానికి సంబంధించిన ప్రకంపనలా కాదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. రంగంలోకి దిగిన అధికారులు ఎలాంటి నష్టం సంభవించలేదని స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం ఉదయం 10:10 గంటల సమయంలో.. గాజులరామారంలోని మెట్‌ఖాన్‌గూడా ప్రాంతంలో భూమి కంపించింది. రెప్పపాటులో జరిగిన ఈ ఘటనతో ఇళ్లలోని వస్తువులు కదిలిపోవడంతో పాటు, కొన్ని చోట్ల నేలపై పడిపోయాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి రోడ్లపై గుమిగూడారు. భూకంప భయంతో స్థానికంగా ఉన్న పలు విద్యా సంస్థలు అప్రమత్తమయ్యాయి. విద్యార్థుల భద్రత దృష్ట్యా స్కూల్ యాజమాన్యాలు తక్షణమే సెలవులు ప్రకటించాయి. మెట్‌ఖాన్‌ గూడలోని ప్రభుత్వ పాఠశాలలో బెంచీలపై ఉన్న జ్యామెట్రీ బాక్సులు కిందపడినట్లు విద్యార్థులు, ఉపాధ్యాయులు తెలిపారు. మెట్‌ఖాన్‌ గూడలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో భూకంపానికి సంబంధించిన దృశ్యాలు సెక్యూరిటీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వీడియోల్లో భూమి కంపించడంతో పాటు వస్తువులు కదిలినట్లు స్పష్టంగా కనిపించాయి. అయితే ఇది నిజంగా భూకంపమేనా? లేక ఎక్కడైనా పేలుడు పదార్థాలతో వచ్చిన శబ్దమా? అన్న సందేహాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇప్పటివరకు మెట్‌ఖాన్‌గూడ ప్రాంతంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం స్థానికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. శబ్దం, భూమి కంపించడం ఒకేసారి రావడంతో.. ఇది నిజంగానే భూ ప్రకంపనలతో జరిగిందా.. లేక ఎవరైనా కావాలని ఇలా చేశారా అనే దానిపై అధికారులు అక్కడి స్థానికుల ద్వారా ఆరా తీశారు. ఇప్పటివరకు అధికారికంగా భూకంపమని ధ్రువీకరించే ప్రకటన విడుదల కాలేదు.

Leave A Reply

Your email address will not be published.