Take a fresh look at your lifestyle.

కోదాడ మున్సిపాలిటీ ఎన్నికలకు సర్వం సిద్ధం

 

ముద్ర ప్రతినిధి , కోదాడ

…. రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు కోదాడ ఆర్డీఓ సిఎచ్. సూర్యనారాయణ వెల్లడించారు.
స్థానిక సి.సి. రెడ్డి ఉన్నత పాఠశాల నుంచి పోలింగ్‌కు అవసరమైన ఎన్నికల సామాగ్రిని బలమైన భద్రత మధ్య ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఈ ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 491 మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. ఇందులో పోలింగ్ అధికారులు, సహాయ అధికారులు, మైక్రో ఆబ్జర్వర్లు, రిటర్నింగ్ సిబ్బంది ఉన్నారు. ఓటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 200 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.


పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయడంతో పాటు, సమస్యాత్మక కేంద్రాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు ఆర్డీఓ వివరించారు. ఓటర్లు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని, ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆర్డీఓ సూచించారు. కోదాడ మున్సిపాలిటీలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉందని పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.