- జగిత్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల నిరసన.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జనంసాక్షి ఎడిటర్ రహమాన్ పై అక్రమంగా పెట్టిన కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా తాహసిల్ చౌరస్తా వద్ద శనివారం జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన కార్యక్రమం చేపట్టారు.ప్రెస్ క్లబ్ నుండి తాహసిల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.అనంతరం ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా జర్నలిస్టులు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చీటి శ్రీనివాసరావు మోరపల్లి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లా రాజోలు మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామ రైతులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘటనతో ఏటువంటి సంబంధంలేని జనంసాక్షి ఎడిటర్ రహమాన్ పై అక్రమంగా కేసులు పెట్టారన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాటాన్ని జనంసాక్షి పత్రికలో కథనాలు ప్రచురిస్తే ఫ్యాక్టరీ యాజమాన్యం తప్పుడు ఫిర్యాదు ఇచ్చి, అక్రమంగా ఎడిటర్ పై కేసులు పెట్టారన్నారు. ప్రశ్నించే గొంతును నొక్కటం ఏమిటని మీడియా సభ్యులు మండిపడ్డారు. తక్షణమే జనంసాక్షి ఎడిటర్ రహమాన్ పై పెట్టిన కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగుల గోపాలచారి, సీనియర్ పాత్రికేయులు బొడ్డుపల్లి అంజయ్య, రాజేందర్ రెడ్డి, బద్ధం నారాయణరెడ్డి, సిరిసిల్ల వేణుగోపాల్, తుమ్మన పల్లి మారుతి, బోయిన్పల్లి శ్రీధర్ రావు, హైదర్ , సులేమాన్, ఇక్రమ్, రాజారెడ్డి, మహేష్ , శ్రీనివాస్, తదితర పాత్రికేయులు పాల్గొన్నారు.