ముద్ర ప్రతినిధి, సంగారెడ్డి.
జిల్లాలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అమలు ప్రక్రియ పురోగతిపై జిల్లా కలెక్టర్ ప్రావీణ్య గురువారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో డిప్యూటీ డీఎం&హెచ్‌ఓ, డీసీహెచ్‌ఎస్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్, జోగిపేట, పఠాన్ చెరువు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్లు, సదాశివపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆభా ,ఖాతాల నమోదు సంఖ్యను పెంచాలని, ప్రతి రోగికి తప్పనిసరిగా ఆభా ఐడీ నమోదు చేయాలని సూచించారు. అలాగే ప్రతి ఓపీ స్లిప్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ను డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో అప్లోడ్ చేయాలని, ఫార్మసీ సేవలను కూడా డిజిటలైజ్ చేయాలని ఆదేశించారు. ఇంటర్నెట్ వేగాన్ని మెరుగుపరచి సేవల అందుబాటును పెంచాలని తెలిపారు.
డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అమలుతో రోగుల ఆరోగ్య చరిత్ర, పరీక్షల వివరాలు, చికిత్స సమాచారం ఒకే వేదికపై అందుబాటులో ఉండి, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన మరియు సమర్థవంతమైన వైద్య సేవలు అందించవచ్చని పేర్కొన్నారు. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమీక్ష సమావేశంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. మురళీకృష్ణ, డీసీహెచ్‌ఎస్ డా. కవిత, డా. శశాంక్, ఇతర వైద్యాధికారులు మరియు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.