వీర శైవ సమాజానికి అండగా ఉంటా -వీరశైవ బసవ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
ముద్ర,వికారాబాద్ :
సమాజ సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్న వీరశైవ సమాజానికి తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శ్రీ జగజ్యోతి బసవేశ్వర విద్యాసంస్థ ఆధ్వర్యంలో ఎన్నేపల్లిలో కొత్తగా నిర్మించిన వీరశైవ బసవ భవనాన్ని ఆయన శుక్రవారం ఆలయం ఆలంపల్లి కెంపిన, దుద్దిని పీఠాధిపతి డాక్టర్ చెన్న బసవప్రభు స్వామి, జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్, విద్యాసంస్థ బాధ్యులు, సమాజ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ శ్రీ జగజ్యోతి బసవేశ్వర విద్యా సంస్థ వీరశైవ సమాజం ఆధ్వర్యంలో నిర్వహించే ధార్మిక, ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాలకు తన వైపు నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. వీరశైవ సమాజం సభ్యులు ఐక్యతగా ఉండి నిర్మించిన బసవ భవన్ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. సమాజానికి ఉపయోగపడే విధంగా బస్సు భవనాన్ని నిర్మించడం ఎంతో అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. విద్యాసంస్థ అధ్యక్షుడు బస్వరాజ్ మాట్లాడుతూ బసవేశ్వరుడి బోధనలు, ఇతర ఆధ్యాత్మిక విద్యతో పాటు ఆధునిక విద్యను ప్రాంత వాసులకు చేరువ చేయాలనే ఉన్నత లక్ష్యంతో శ్రీ జగజ్యోతి బసవేశ్వర విద్యా సంస్థ ఏర్పాటైందని అన్నారు. ఎలాంటి లాబాపేక్ష లేకుండా ఆధ్యాత్మిక, ధార్మిక విద్యాభివృద్ధి పెంపొందించడమే లక్ష్యంగా విద్యా సంస్థ కృషి చేస్తుందని చెప్పారు. విద్యా సంస్థ, వీరశైవ సమాజం ఆధ్వర్యంలో నిర్మించిన వీర శైవ బసవ భవనాన్ని పేదలు వివిధ కార్యక్రమాలకు వినియోగించుకునేందుకు ఉపయోగపడేలా నిర్మించామని, దీంతో వచ్చే ఆదాయాన్ని విద్యాభివృద్ధికి వినియోగించనున్నట్లు ఆయన తెలిపారు. అంతకు ముందు వీరశైవ ఆగమ పండితులు మఠపతి సాంబశివశర్మ, బస్వరాజ్ స్వామి, దైవజ్ఞ విశ్వేశ్వర్, మఠం చంద్రశేఖర్, పులుమద్ది మల్లేశం, పార్వతయ్య స్వామి ఆధ్వర్యంలో మహా రుద్రాభిషేకం తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ అనన్య, జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు ఆకుల మహేష్ కుమార్, విద్యాసంస్థ బాధ్యులు అప్ప విజయకుమార్, కౌకుంట్ల వీరేశం, శుభప్రద్ పటేల్, ఎస్ ఆత్మలింగం, చెక్క వీరన్న, పటేల్ సంపూర్ణ ఆనంద్, కేటీ సంగప్ప, మిర్యాణం శివకుమార్, సమాజం బాధ్యులు విద్యాసాగర్ విజయకుమార్, భద్రప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బసవ భవనం నిర్మాణానికి విరాళాలు అందజేసిన వారిని ఘనంగా సన్మానించారు.