- సిట్ అధికారులకు సహకరిస్తా.
- జాతీయ స్థాయి అంశంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.
- ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐ విచారణకు అప్పగించాల్సిందే.
- బీజేపీ కరీంనగర్ పార్లమెంటరీ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు వెల్లడి.
ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఈనెల 28న హైదరాబాద్ లో సిట్ పోలీసులు నిర్వహించే విచారణకు హాజరవుతానని బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు వెల్లడించారు.ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన తనవద్దనున్న సమాచారాన్ని అందజేయడంతోపాటు సిట్ పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు.ఈ మేరకు కరీంనగర్ లో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర హోంమంత్రి శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సైతం అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు సిట్ విచారణకు హాజరుకానున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యర్థి పార్టీలకు చెందిన వేలాది మంది నాయకుల ఫోన్లను ట్యాప్ చేసిందన్నారు. భార్యాభర్తలు పడక గదిలో మాట్లాడుకునే సంభాషణలను సైతం రికార్డు చేసిన నీచమైన చరిత్ర బీఆర్ఎస్ సర్కార్ దేనన్నారు.చివరకు జడ్జీల ఫోన్లను సైతం వదల్లేదన్నారు.ఫోన్ ట్యాపింగ్ విషయంలో తెలంగాణ పరువును భ్రష్టు పట్టించారని మండిపడ్డారు.ఇంతటి తీవ్రమైన అంశాన్ని విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నెలల తరబడి సాగదీస్తోందని విమర్శించారు.బీఆర్ఎస్ తో కుమ్మక్కై డీల్ కుదిరినందునే ఫోన్ ట్యాపింగ్ పై తూతూ మంత్రంగా విచారణ చేస్తున్నారని దుయ్యబట్టారు.ఈ అంశాన్ని బీజేపీ ఇంతటితో వదిలిపెట్టబోదని తేల్చి చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ జరిపించేదాకా బీజేపీ పక్షాన ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. అందులో భాగంగా ఫోన్ ట్యాపింగ్ పై న్యాయ స్థానంలో ఇప్పటికే కేసు వేశామని, ఇకపై ఈ అంశంపై జాతీయస్థాయిలో పోరాటాన్ని ఉదృతం చేస్తామని పేర్కొన్నారు.