ముద్ర, నారాయణపేట:
పట్టణంలోని యాద్గిరి రోడ్డు ఎర్రగుట్ట వద్ద పోలీసుల తనిఖీల్లో సరైన పత్రాలు లేని నగదు, వస్త్రాలు పోలీసులు గుర్తించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన విషయం తెలిసినదే. శనివారం తనిఖీలు చేస్తుండగా రూ. 2 లక్షల 89 వేల నగదు అలాగే రూ. 1 లక్ష 57 వేల విలువచేసే వస్త్రాలను గుర్తించారు. ఈ సందర్భంగా ఎస్సై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నికల నిబంధనల ప్రకారం నగదు విలువైన వస్తువులు రవాణా సమయంలో తప్పనిసరిగా సంబంధిత పత్రాలు ఉండాలన్నారు. లేనిపక్షంలో ఎన్నికల నిబంధన ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలంటే ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు.
