- ఉత్కంఠ రేపుతోన్న సీఎం, టీపీసీసీ చీఫ్ ఢిల్లీ టూర్.
- ఏఐసీసీ అగ్రనేతలతో ఇరువురి వరుస భేటీలు.
- కీలక అంశాలపై రాహుల్ గాంధీతో మహేశ్ కుమార్ గౌడ్ చర్చ.
- కేసీని కలిసి రేవంత్, మహేశ్ కుమార్ గౌడ్.
- మళ్లీ తెరపైకి సామాజిక సమీకరణాలు.
- ముందుగా పీసీసీ కూర్పు.. ఆ తర్వాత మంత్రి వర్గ విస్తరణ.
- ఈసారి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు.
- ఢిల్లీలో అందుబాటులో లేని ఏఐసీసీ చీఫ్.
- ఈ నెల 30న మరోసారి హస్తీనాకు రావాలని సీఎం, టీపీసీసీ చీఫ్ కు హైకమాండ్ ఆదేశం.
ముద్ర, తెలంగాణ బ్యూరో : మంత్రివర్గ విస్తరణ పీసీసీ కూర్పుపై అధికార పార్టీలో హైటెన్షన్ నెలకొన్నది.అత్యంత ఉత్కంఠ, ఆసక్తి రేపుతోన్న ఆయా పదవుల భర్తీపై 17 నెలల నుంచి కొనసాగుతోన్న సస్పెన్స్ కు త్వరలోనే తెరపడనుంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్ధితులు, అధికార పార్టీ నేతల్లో కొనసాగుతోన్న అంతర్గత విభేదాలు, పొరపచ్చాలను పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ హైకమాండ్ ఆయా పదవుల భర్తీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నది.ఏఐసీసీ అగ్రనేతల పిలుపుతో మూడు రోజుల క్రితం హస్తీనాకు వెళ్లిన సీఎం, టీపీసీసీ చీఫ్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో వేర్వేరుగా భేటీ అయ్యారు.మంత్రి వర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుకు సంబంధించి నెలకొన్న పోటీ.. ఆశావాహుల వివరాలను అగ్రనేతల ముందు ఉంచారు. రేవంత్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్ నుంచి వేర్వేరుగా సలహాలు, సూచనలు, అభిప్రాయాలు సేకరించిన పార్టీ పెద్దలు ఆయా పదవుల భర్తీ విషయంలో సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించారు.ఆ మేరకు అభ్యర్ధులను గుర్తించి వారికి పదవులు ఇవ్వాలని సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.అయితే ప్రస్తుతం మంత్రి పదవులకు పార్టీలో తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో కేబినెట్ విస్తరణను కాస్త ఆపాలని అధిష్టానం సూచించినట్లు సమాచారం. ప్రస్తుతానికి టీపీసీసీ కార్యవర్గాన్ని ఎంపిక చేయాలని ఆదేశించింది.కాగా పీసీసీ కూర్పులో ఈసారి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించాలని అధిష్టానం కీలక సూచనలు చేసింది. మంత్రివర్గ విస్తరణ విషయానికి వస్తే సుదర్శన్ రెడ్డి (బాన్సువాడ), ఆది శ్రీనివాస్ (వేములవాడ), శ్రీహరి ముదిరాజ్ (మక్తల్), కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి (మునుగోడు), ప్రేమ్ సాగర్ రావు (మంచిర్యాల), వివేక్ వెంకటస్వామి (చెన్నూరు), మల్ రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం)తో పాటు ఇంకొందరు పోటీలో ఉన్నారు. కాగా సారి తనకు కూడా అవకాశం కల్పించాలని మల్ రెడ్డి రంగారెడ్డి ఇప్పటికే అధిష్టానం పెద్దలను కలిసి కోరారు.పీసీసీ కార్యవర్గం విషయానికి వస్తే కాంగ్రెస్ అధిష్టానం సామాజిక సమీకరణలకు పెద్దపీట వేయాలని నిర్ణయం తీసుకున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 70 శాతం వరకు అవకాశం కల్పించనుంది.నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్‌లు, పెద్ద సంఖ్యలో జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్‌ల జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌లుగా రోహిన్ రెడ్డి, సంపత్ కుమార్ బలరాం నాయక్ పేర్లు దాదాపు ఖరారు అయ్యాయని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మైనార్టీల జాబితాలో ఫహీమ్ లేదా ఫిరోజ్ ఖాన్‌కు ఇచ్చే అవకాశం కల్పించాలని అధిష్టానం భావిస్తోంది.
- 30న ఢిల్లీలో మరోసారి భేటీ.
మూడు రోజుల పాటు ఢిల్లీల్లో ఉన్న సీఎం, టీపీసీసీ చీఫ్ రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు.మంత్రివర్త విస్తరణ, పీసీసీ కూర్పుపై చర్చించారు.అయితే ఆయా పదవుల ఎంపిక అనేక సవాళ్లతో కూడుకుని ఉండడంతో వాటి భర్తీ విషయంలో ఆచీతూచి వ్యవహరిస్తోన్న అధిష్టానం రాష్ట్ర పార్టీలో మిగతా సీనియర్ల నుంచి వ్యతిరేకత రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఈ క్రమంలో ఆయా పదవుల భర్తీ విషయంలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే నిర్ణయాన్ని ప్రాధాన్యాంశంగా తీసుకుంది.అయితే ఖర్గే ప్రస్తుతం ఢిల్లీలో అందుబాటులో లేకపోవడంతో టీపీసీసీ కార్యవర్గాన్ని వాయిదా వేసింది. ఈ క్రమంలో ఈ నెల 30న మరోసారి ఢిల్లీకి రావాలని అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఇతర సీనియర్ నాయకులకు సూచించింది.