Take a fresh look at your lifestyle.

రెండు రోజుల్లో పీసీసీ కమిటీలు

  • రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ విషయంలో అధిష్టానానికి మా అభిప్రాయం వినిపించాం.
  • వీలైనంత త్వరగా కేబినెట్ ను విస్తరించాలని రాహుల్ ను కోరాం.
  • మంత్రివర్గంలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని విన్నవించాం.
  • రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కేసీ.. అగ్రనేతలతో మాట్లాడుతున్నారు.
  • మీడియాతొ టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఉత్కంఠ రేపిన సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీ పర్యటనపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. అందరూ ఊహించినట్టే మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కూర్పుపై అధిష్టానం టీపీసీసీ నేతలకు దిశానిర్దేశం చేసింది. ఆయా పదవుల్లో సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించింది. రాష్ట్ర రాజకీయ పరిణామాలు, పార్టీ ప్రస్తుత పరిస్థితులకనుగూణంగా పదవుల కేటాయింపునకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  మూడు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన సీఎం, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ మంత్రి వర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పునకు తుది రూపం తీసుకొచ్చే ప్రయత్నాన్ని దాదాపుగా పూర్తి చేశారు. ఈ నెల 25 కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయిన రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చించారు. సోమవారం కూడా కేసి వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. అలాగే పార్టీ యువనేత రాహుల్ గాంధిని కుటుంబ సమేతంగా కలిసిన టీపీసీసీ చీఫ్ రాష్ట్ర రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుత పరిస్థితులను వివరించారు.ఈ క్రమంలో మహేశ్ కుమార్ గౌడ్ సోమవారం రాత్రి మీడియాతో మాట్లాడారు.రాహుల్ గాంధీని కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన కొన్ని అంశాలను యువనేతకు వివరించినట్లు తెలిపారు.. వీలైనంత త్వరగా రాష్ట్ర కేబినెట్ కూర్పు చేయాలని కోరానన్నారు. దీనిపై రాహుల్ గాంధీ సైతం త్వరలోనే ఆ ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. మంత్రి వర్గ విస్తరణతో పాటు రెండు రోజుల్లోనే పీసీసీ కమిటీలను కూడా ప్రకటిస్తామని చెప్పారు.అత్యంత ఉత్కంఠ, సవాలుగా మారిన రాష్ట్ర కేబినెట్ విస్తరణ విషయంలో అధిష్టానానికి తమ అభిప్రాయం చెప్పామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మంత్రి వర్గ విస్తరణలో బీసీలకు ప్రాతినిధ్యం ఉండాలని కోరినట్లు వెల్లడించారు.రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాల గురించి కేసి వేణుగోపాల్ పార్టీ అగ్రనేతలతో మాట్లాడుతున్నారని తెలిపారు.
  • కాంగ్రెస్ ఓబీసీ రౌండ్ టేబుల్ సమావేశం.
అఖిల భారత కాంగ్రెస్ సోమవారం ఢిల్లీలోని ఇండియా ఇంటర్ నేషనల్ సెంటర్లో ఓబీసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఇందులో ఏఐసీసీ నాయకులతో పాటు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఓబీసీ మంత్రులు, బీసీ ఎంపీలు,ఎమ్మెల్యేలు ,ముఖ్య నేతలు పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా కులగణన చేపెట్టాలని రాహుల్‌ గాంధీ డిమాండ్ కు తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం జన గణన లో కుల గణన చేస్తామని ప్రకటిన నేపథ్యంలో రాహుల్ గాంధీకి అభినందనలు తెలుపుతూ తీర్మాణం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో ప్రజా పాలన ప్రభుత్వం చేసిన కులగణన పై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కులగణన అనంతరం సామాజిక న్యాయం జరిగేలా రాజకీయ విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేసిందని దానికి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చారని సమావేశంలో పాల్గొన్న ప్రముఖులకు మంత్రి పొన్నం వివరించారు.
  • కులగణనలో తెలంగాణ దేశానికి ఆదర్శం : మంత్రి పొన్నం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం ఢిల్లీ లోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ లో ఏఐసీసీ.. ఓబీసీ ప్రతినిధుల కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఏఐసీసీ జనరల్ సెక్రటరీతో పాటు తెలంగాణ నుంచి పీసీసీ చీఫ్, బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ బీసీ నేతల బృందం హాజరైంది. ఈ సమావేశానికి ముందు మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే దారిలోనే కేంద్రం కూడా దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించబోతున్నదన్నారు. కులగణనతోనే దేశంలో బలహీనవర్గాలకు న్యాయం దక్కుతుందని అభిప్రాయపడ్డారు. జనాభా ప్రకారం వాటా దక్కాలనేది రాహుల్‌ గాంధీ అబిమతం అన్నారు. కులగణన చేపట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బలహీనవర్గాలకు మేలు జరిగేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలో కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిస్తామన్నారు. కులగణన ఎవరికి వ్యతిరేకం కాదన్నారు. ఈ గణన ద్వారా ఇన్నాళ్లు అవకాశం దక్కని బీసీలంతా ప్రజాస్వామ్య వేదికలో భాగస్వామ్యం అవుతారని అభిప్రాయపడ్డారు. తెలంగాణ చేపట్టిన కులగణను విధివిధానాలపై ఓ పుస్తకాన్ని తీసుకువచ్చి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ నిర్వహించిన కులగణన సర్వేకు దశ, దిశా నిర్దేశం చేసిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి త్వరలోనే ధన్యవాద సభ ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ సీనియర్ నేత వి.హన్మంత రావు వెల్లడించారు. అందులో కాంగ్రెస్  ఒత్తిడి వల్లే కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. భారత జోడో యాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయన ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కులగణన చేశామని తెలిపారు. వచ్చే స్ధానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు జరుగుతాయని హన్మంతరావు ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.