- అధికార్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశం.
- మిల్లర్లు దాన్యం తరుగు తీస్తే సహించబోమని హెచ్చరిక.
- శ్రీరామ నవమి తర్వాత ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం.
- పది రోజుల్లో కొత్త రేషన్ కార్డుల మంజూరు.
- యాసంగిలో కూడా సన్న రకం వరికి బోనస్.
ముద్ర, పాలేరు : మిల్లర్లు అర కేజీ ధాన్యం తరుగు తీసినా కేసులు పెట్టి జైలుకు పంపాలని రాష్ట్ర రెవెన్యూ , గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికార్లను ఆదేశించారు. శుక్రవారం నెలకొండపల్లి మండలంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బోదుల బండలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం, రూ.3 కోట్లతో చేపట్టిన రాయగూడెం, తక్కెళ్లపాడు రోడ్డు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని మిల్లర్లు రైతుల ధాన్యం కటింగ్ పెడితే సహించబోమని హెచ్చరించారు. రైతుల విషయంలో అధికార్లు కూడా అలసత్వం వహించ వద్దన్నారు. రైతును రాజును చేయలనే ఉదేశ్యంతోనే తమ ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని చెప్పారు. గత ప్రభుత్వ పెద్ద మనిషి రూ. 7.19లక్షల కోట్లు అప్పులు చేసి పోతే, వాటిని తీరుస్తూ 25.65 లక్షల మంది రైతులకు రూ. 20.6 వేల కోట్ల మేర రుణ మాఫీ చేశామన్నారు. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం రైతు బంధు కింద రూ.10 వేలు ఇస్తానని ఇవ్వలేక పోయిందని, ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తరువాత, ఏడాదికి ఎకరానికి రూ. 12 వేల చొప్పున రైతు భరోసా ఇస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం పెండింగులో పెట్టిన రైతు బంధు నిధులను కూడా తామే చెల్లించామన్నారు. అంతే కాకుండా, ఇందిరమ్మ ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించడంతో పాటు సన్న రకానికి రూ.500 బోనస్ కూడా ఇస్తుందన్నారు. యాసంగిలో కూడా రైతులు పండించిన ధాన్యానికి బోనస్ చెల్లిస్తామని తెలిపారు. శ్రీరామ నవమి తర్వాత ఇందిరమ్మ ఇళ్ళు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం చేపడతామని చెప్పారు. రాబోవు వారం రోజుల్లో రేషన్ కార్డులను మంజూరు చేస్తామని వెల్లడించారు. పేదల సమస్యలు పరిష్కారం కోసం ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగా లేక పోయినా, గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ, మరొక పక్క అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, జిల్లా సహకార అధికారి గంగాధర్, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్ కుమార్, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ శ్రీలత, ఆర్ అండ్ బి ఎస్ఇ యుగంధర్, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, మిషన్ భగీరథ ఇఇ వాణిశ్రీ, నేలకొండపల్లి మండల తహసీల్దార్ మానిక్ రావు, ఎంపిడివో ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు.
