బియ్యం ఎగుమతుల్లో భారీ కుంభకోణం
నిందితుడు మీ సలహాదారుడా..?
అధికార పక్షంపై హరీశ్ రావు ఫైర్
మంత్రి ఉత్తమ్ కౌంటర్
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రేషన్ బియ్యం ఎగుమతులపై అసెంబ్లీ అట్టుడికింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖలో బియ్యం ఎగుమతుల చుట్టూ భారీ కుంభకోణం జరిగిందంటూ సోమవారం అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల కేసుల్లో నిందితుడిగా ఉన్నవ్యక్తిని ప్రభుత్వానికి అడ్వైజర్‌గా ఎలా నియమించుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై తక్షణమే ‘హౌజ్ కమిటీ’ వేయాలని డిమాండ్ చేశారు. రూ. వేల కోట్ల బ్యాంక్ ఫ్రాడ్, బంగారం స్మగ్లింగ్ వంటి సీబీఐ, ఈడీ కేసుల్లో నిందితుడిగా ఉన్న ప్రేమ్ చంద్ గార్గ్ అనే వ్యక్తిని బియ్యం ఎగుమతులకు అడ్వైజర్‌గా ఎందుకు నియమించుకున్నారని హరీశ్ రావు నిలదీశారు. ఆయన ఇచ్చిన తప్పుడు సలహాల వల్లే రాష్ట్ర ఖజానాకు భారీ గండి పడిందని ఆరోపించారు. పది లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఫిలిప్పీన్స్ కు ఎగుమతి చేస్తామని, ఇది ఒక అంతర్జాతీయ విజయం అని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం.. తీరా చూస్తే కేవలం 22,750 టన్నుల దగ్గరే ఎందుకు ఆగిపోయిందని ప్రశ్నించారు. ఏడాది కాలంగా సుమారు 7,500 టన్నుల బియ్యం కాకినాడ పోర్టు లోనే నిలిచిపోయి పురుగులు పడుతున్నాయని, దీనికి బాధ్యులు ఎవరని ఆయన అడిగారు. వాటాల బేరసారాలు కుదరకపోవడం వల్లే ఎగుమతులు ఆగిపోయాయని హరీశ్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ పాలన పారదర్శకంగా ఉంటే, తాము తప్పు చేయలేదని భావిస్తే.. ఈ కుంభకోణాలపై విచారణకు హౌజ్ కమిటీ వేయాలని, దీనిని తాము ఆధారాలతో సహా నిరూపిస్తామని సవాల్ విసిరారు.
మంత్రి ఉత్తమ్ స్ట్రాంగ్ కౌంటర్..
హరీశ్ రావు ఆరోపణలను పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలని కొట్టిపారేశారు. హరీశ్ రావు సిఫార్సు చేసిన వారిని అడ్వైజర్లుగా పెట్టుకోలేదనే అక్కసుతోనే సభలో ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రేమ్ చంద్ గార్గ్‌కు ఫిలిప్పీన్స్ బియ్యం ఎగుమతులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇది కేవలం తెలంగాణ ప్రభుత్వం, ఫిలిప్పీన్స్ ప్రభుత్వం మధ్య జరిగిన ఒప్పందమని స్పష్టం చేశారు. ఫిలిప్పీన్స్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం వల్ల అక్కడ అన్ని రకాల దిగుమతులపై ఆంక్షలు విధించారని, అయితే కేవలం తెలంగాణ రైస్ ఇంపోర్టుకు మాత్రమే మినహాయింపు ఇచ్చారని తెలిపారు. కేవలం ఒక్క రేషన్ బియ్యం షిప్‌మెంట్ మాత్రమే కాకినాడలో ఆగిపోయిందని మంత్రి ఉత్తమ్ వివరణ ఇచ్చారు.