ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూముల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అభిలాష అభినవ్ హెచ్చరించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ తానూర్ మండల పరిధిలోని పలువురు లబ్ధిదారులు తమకు కేటాయించిన ప్రభుత్వ అసైన్డ్ భూములను సాగు చేయకుండా వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్నట్లు దృష్టికి వచ్చిందన్నారు. కొందరు మొరం వ్యాపారం సాగిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఈ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తులను గుర్తించి వారి పేరిట ఉన్న పట్టాలను తక్షణమే రద్దు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ అసైన్డ్ భూములను అర్హులైన పేదలు సాగు నిమిత్తం మాత్రమే వినియోగించు కోవాలన్నారు. ఇతరులకు విక్రయించడం, వాణిజ్య అవసరాలకు మళ్లించడం చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే వారి పట్టాలను రద్దు చేసి భూములను ప్రభుత్వానికి తిరిగి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.