- ఏప్రిల్ 14 వరకు మాన్యువల్ దరఖాస్తులకు అవకాశం.
- మండల, మున్సిపల్ ప్రజా పాలనా సేవా కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ.
- జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి.
- జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి సూచన.
ఉమ్మడి రంగారెడ్డి, ముద్ర ప్రతినిధి: రాజీవ్ యువ వికాస పథకం కింద నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి యూనిట్ల మంజూరు కోసం దరఖాస్తు గడువును ఏప్రిల్ 14 వరకు ప్రభుత్వం పొడిగించిందని రంగారెడ్డిజిల్లా కలెక్టర్ సీ నారాయణరెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగ ఎస్ సి, ఎస్ టి, బి సి, మైనారిటీ,ఓబిసి, ఈబీసీ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.రాజీవ్ యువ వికాస్ పథకానికి మండల ప్రజా పాలన సేవా కేంద్రాలు, మున్సిపల్ ప్రజా పాలన సేవా కేంద్రాలలో మాన్యువల్ గా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారీ,రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో రాజీవ్ యువ వికాసం పై వీడియో కాన్ఫెరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ యువ వికాసం అమలులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో దరఖాస్తుల పరిస్థితిని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఉప ముఖ్యమంత్రి కి వివరించారు. రాజీవ్ యువ వికాసం కింద ఇప్పటి వరకు జిల్లాలో 92 వేల 492 దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా వచ్చాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకించి రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి ప్రజాపాలన సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. మాన్యువల్ దరఖాస్తులను స్వీకరించేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని మండల ప్రజా పాలన సేవా కేంద్రాలు, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాలలోని ప్రజాపాలన సేవా కేంద్రాలలో ఖాళీ దరఖాస్తు ఫారాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఇప్పటివరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అన్ని దరఖాస్తుల ప్రింట్ కాపీలు తీసి సిద్ధంగా ఉంచుతామని తెలిపారు. గడువు పొడిగింపు మేరకు రాజీవ్ యువ వికాసం కింద స్వయం ఉపాధి పొందేందుకు ఏప్రిల్ 14 లోగా నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకునే విధంగా అన్ని గ్రామాలు, మండల, మున్సిపల్ కేంద్రాలలో విస్తృత ప్రచారం కల్పించి టామ్ టామ్ వేయిస్తామని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు.
- యువతకు ఉపాధికై రూ.10 వేల కోట్ల ఖర్చు: డిప్యూటీ సీఎం మల్లు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజీవ్ యువ వికాస పథకంపై మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం సుమారు 10 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి నిరుద్యోగ ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓబీసీ, ఈ బీసీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాస్ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్లు ఈ పథకంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అమలు చేయాలని, క్షేత్ర స్థాయి వరకు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని, మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి పథకం విధి విధానాలను స్పష్టంగా తెలియజేయాలని చెప్పారు. అలాగే జిల్లా మంత్రులు , శాసనసభ్యులతో రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసే విధంగా విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. యువత వారి కాళ్లపై వారు నిలబడి స్వయం ఉపాధి పొందుటకు ఇది చక్కటి అవకాశం అని, అందువల్ల ఈ పథకంలో పని చేసే ప్రతి ఒక్కరు మనసుపెట్టి పని చేయాలని, రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తు చేసుకునే తేదీని పొడిగించాలని క్షేత్రస్థాయి నుంచి వచ్చిన అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్ 14 వరకు దరఖాస్తు చేసుకునే తేదీని పొడగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పథకం కింద అర్హత పొందిన లబ్ధిదారులకు జూన్ 2న మంజురీ ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అనంతరం దశలవారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆన్లైన్లో దరఖాస్తుల ను స్వీకరించడంలో ఉన్న ఇబ్బందులను అధిగమించేందుకు గాను అన్ని మండల ప్రజా పాలన సేవా కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాలలోని ప్రజాపాలన సేవా కేంద్రాలలో మాన్యువల్ గా దరఖాస్తులను స్వీకరించాలని ఆదేశించారు. ఆన్లైన్ పోర్టల్ నుండి కేవలం ఖాళీ దరఖాస్తులు మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలన్నారు . ఇక పై ఎలాంటి అప్లికేషన్లను ఆన్లైన్లో అనుమతించవద్దని, ఇది వరకు ఆన్లైన్ ద్వారా స్వీకరించిన అన్ని దరఖాస్తుల కాపీలను ప్రింట్ తీసి ఉంచుకోవడంతోపాటు ,డేటా ఎంట్రీ చేయాలని చెప్పారు . ఇకపై రాజీవ్ యువ వికాసం కింద దరఖాస్తు చేసుకునేవారు దరఖాస్తులను మండల ప్రజా పాలన సేవ కేంద్రాలలో తీసుకోవాలని, దరఖాస్తులను పూర్తిచేసి మండల ప్రజా పాలన కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాలలోని ప్రజాపాలన కేంద్రాలలో ఇవ్వాలని ఆయన అన్నారు.
- పక్కాగా అమలు చేయండి : మంత్రి శ్రీధర్ బాబు
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా ఎస్సీ, ఎస్టీ ,బీసీ ,మైనార్టీ, ఓ బి సి, ఈ బీసీ యువతకు స్వయం ఉపాధి పథకాలను అమలు చేస్తున్నప్పటికీ అవి సరైన విధంగా అమలు కావటం లేదని, అందుకే రాజీవ్ యువ వికాస పథకాన్ని అమలు చేసేందుకు నిర్ణయించడం జరిగిందని, రాజీవ్ యువ వికాస పథకం లో నాణ్యతను ఏ విధంగా పెంపొందింప చేయాలో జిల్లా కలెక్టర్లు ఆలోచించాలని, ఈ పథకం కింద ఏర్పాటు చేసిన యూనిట్లు శాశ్వతంగా ఉపాధి పొందేలా ఉండాలని ,ప్రతి జిల్లాలో ఈ పథకాన్ని ప్రత్యేకంగా ప్రత్యేకంగా పర్యవేక్షించేందుకు అధికారిని నియమించాలని సూచించారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సందీప్ కుమార్ సుల్తానియా, శ్రీధర్, తదితరులు సూచనలు, సలహాలు చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, డి.ఆర్.డి.ఏ పిడి శ్రీలత, బిసి,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు కేశురాం, సంధ్యా రాణి, పద్మావతి, రాజేశ్వరి దేవి, నవీన్ కుమార్ రెడ్డి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.