పైప్ లైన్ పేలడంతో ధ్వంసమైన మురుగునీటి వ్యవస్థ – అపార్ట్మెంట్లలోకి చేరిన నీరు – భయాందోళనకు గురైన స్థానికులు
ముద్ర, బండ్లగూడ: మణికొండలో తెల్లవారుజామున మంజీరా పైప్ లైన్ ఒకసారి గా పేలింది. ఆంద్రా బ్యాంకు వీధి ఓ సూపర్ మార్కెట్ ఎదురుగా బుధవారం తెల్లవారుజామున మంజీరా పైప్ లైన్ పెద్ద శబ్దంతో పేలింది. ఈ పేలుడు దాటిలో దగ్గరలో ఉన్న మురుగునీటి పారుదల కాలువలు కూడా ధ్వంసం అయ్యాయి. ఒక్కసారిగా మంచినీరు మురుగునీరు కలిసి పక్కనే ఉన్న రెండు అపార్ట్మెంట్ల సెల్లార్లలోకి చేరాయి. పేలుడు సమయంలో రోడ్డు పూర్తిగా కుంగిపోయి అక్కడ పెద్ద గోతి ఏర్పడింది. అపార్ట్మెంట్ల నుండి బయటకు రాడానికి అవకాశాలు లేకపోవడంతో పాటు నీరు ఇంకా చేరుతుండడంతో స్థానికులు తమను కాపాడాలి అంటూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పంపించారు. కేవలం ఐదు నిమిషాల్లో సెల్లార్లు, రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి. సమాచారం అందుకున్న మంచినీటి సరఫరా శాఖ అధికారులు వెంటనే నీటి సరఫరాను నిలిపివేశారు. అనంతరం సంఘటన స్థలానికి చేరుకొని సెల్లార్లలో చేరిన నీటిని నాలుగు గంటల పాటు శ్రమించి తోడేశారు. ప్రస్తుతం పైప్ లైన్, మురుగునీటి వ్యవస్థకు మరమ్మత్తులు చేస్తున్నామని గురువారం వరకు మరమ్మతులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు.