Take a fresh look at your lifestyle.

నాగర్ కర్నూల్‌లో సంక్షేమ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ CMRF చెక్కుల పంపిణీ – ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి

 

నాగర్ కర్నూల్, ముద్ర ప్రతినిధి:

నాగర్ కర్నూల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బిజినపల్లి మరియు తిమ్మాజిపేట మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి (CMRF), కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రతి వర్గానికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా పేద కుటుంబాల్లో కూతుళ్ల వివాహాలకు ఆర్థిక సహాయం అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని అన్నారు. అలాగే, అత్యవసర వైద్య అవసరాలు లేదా ఇతర సంక్షోభ పరిస్థితుల్లో సీఎం సహాయనిధి ద్వారా అందుతున్న సాయం ప్రజలకు ఆశాకిరణంగా మారిందని కొనియాడారు.

ప్రతి పేద కుటుంబానికి అండగా నిలిచే విధంగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, ప్రజల సంక్షేమం కోసం అందరూ కలిసి సహకరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణరావు, బిజినపల్లి మండల అధ్యక్షుడు మిద్దె రాములు, తిమ్మాజిపేట మండల అధ్యక్షుడు వివేక్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరాం రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లయ్యతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.