త్రాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలకు త్రాగు నీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. అలాగే కడెం ప్రాజెక్టు కు అవసరమైన మరమ్మతులు కూడా చేపట్టి గతంలో మాదిరి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో త్రాగునీటి కొరత రాకూడదన్నారు. సంబంధిత శాఖల అధికారులు నీటి సమస్య ఏర్పడిన ప్రాంతాలను గుర్తించి, నీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. రోజువారి నీటి సరఫరా లో ఆటంకాలు ఎదురైతే ప్రత్యామ్నాయ మార్గాలను ముందుగానే అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కడెం ప్రాజెక్టు గేట్ల మరమ్మత్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వేసవికాలం పూర్తయ్యేలోపు గేట్లకు సంబంధించి ఏవైనా చిన్న చిన్న మరమ్మత్తులు ఉంటే పూర్తి చేయాలని తెలిపారు. ఇప్పటినుంచి గేట్ల మరమ్మత్తుల చర్యలు పూర్తిచేస్తే వర్షాకాలం ఎటువంటి ఇబ్బంది రాదన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, ఆర్ డబ్ల్యూఎస్ ఈఈ సందీప్, ఇరిగేషన్ అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.