Take a fresh look at your lifestyle.

అధికారం శాశ్వతం కాదు రేవంత్ ఈ రోజు నీది.. రేపు మాది-బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

 

ముద్ర, ఆదిలాబాద్ :

అధికారం ఎవరికీ శాశ్వతం కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్నేళ్లు అధికారంలో ఉన్నా ఏదో ఒక రోజు గద్దె దిగాల్సిందేనన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆదిలాబాద్ జైల్లో బాల్క సుమన్ ను పరామర్శించిన ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. బీజేపీ,కాంగ్రెస్ లు మున్సిపల్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడి… బీఆర్ఎస్ అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్నటికీ పలు మున్సిపాలిటీల్లో ప్రజాతీర్పును అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించిందన్నారు. కాంగ్రెస్ ఏడు స్థానాల్లో గెలిచినా అధికార దాహంతో సీఎం,మంత్రి వివేక్ సూచనలకు అనుగుణంగా అధికారులు తొత్తులుగా మారి ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు మహిళా కౌన్సిలర్లపై కాంగ్రెస్ కౌన్సిలర్లు అసభ్యంగా ప్రవర్తించినా కనీసం మంత్రి వివేక్ స్పందించకాపోవడం సిగ్గు చేటన్నారు. ప్రజాస్వామాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే ఉల్టా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను జైల్లో ఉంచారన్న కేటీఆర్.. అదే మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, బీజేపీ ఎంపీ అరవింద్ పోలీసులను తిట్టినా ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. స్పష్టమైన మెజారిటీ వచ్చినా ఆ మెజారిటీని అపహాస్యం చేసే విధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేసిన తమ కార్యకర్తలపై కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. రూ.3 కోట్ల ఆఫర్ ఇచ్చినా తమ కౌన్సిలర్లు లొంగలేదన్నారు. గాంధీ కుటుంబానికి రూ.వెయ్యి కోట్లు ఇవ్వడానికి సిద్ధమని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల డబ్బులు తన అయ్యా సొమ్మా అని ప్రశ్నించారు. రైతులకు రైతు బంధు కోసం డబ్బులు లేవు గానీ, గాంధీ కుటుంబానికి రూ.వెయ్యి కోట్లు ఇచ్చేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి జోగు రామన్న,ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, ప్రశాంత్ రెడ్డి, పల్లె రాజేశ్వర్ రెడ్డి, వివేకానంద, గంగుల కమలాకర్, సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.