Take a fresh look at your lifestyle.

రోగులకు మెరుగైన సేవలు అందించాలి 

  • కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
  • జిల్లా ఆసుపత్రి లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే.

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: రోగులకు ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం ఐఓసిఎల్  సౌజన్యంతో రూ.46 లక్షలతో పెద్దపల్లి జిల్లా మాతా శిశు ఆసుపత్రిలో  ఏర్పాటు చేసిన నవ జాత శిశు కేంద్రం, రూ.55 లక్షలతో ఏర్పాటు చేసిన 40 పడకల ప్రత్యేక వార్డు, రూ.12 లక్షలతో కొనుగోలు చేసిన మెకనైజడ్ లాండ్రీలను కలెక్టర్ కోయ శ్రీ హర్ష, స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావుతో కలిసి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ ఐఓసిఎల్ సంస్థ వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) క్రింద  అందించిన 10 వార్మర్స్, 2 డబుల్ సర్ఫర్ ఫోటో థెరపీ, ఆటోక్లేవ్, సక్షన్ అపారేటస్, బబ్ల్ సి పాప్, వెంటిలేటర్, పొర్టబుల్ X రే  వంటి పరికరాలతో నవ జాత శిశు కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. నవ జాత శిశు కేంద్రం ఏర్పాటు చేసినందున ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య మరింత పెరిగేలా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చర్యలు తీసుకుంటున్నారని, రిస్క్ కేసులను, ప్రీ మెచ్యుర్డ్ ప్రసవాలను కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నారని కూడా కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో  మనం తీసుకుంటున్న చర్యల కారణంగా అవుట్ పేషెంట్ సంఖ్య 700 కు  పెరిగిందని,  మన దగ్గరకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు‌. కంటి శస్త్ర చికిత్సలు, దంత శస్త్ర చికిత్సలు, జనరల్ ఫిజియన్, ఆర్థో శస్త్ర చికిత్సలు పకడ్బందీగా నిర్వహించాలని,ఇన్ పేషెంట్ సేవలు మెరుగ్గా అమలు చేయాలని అన్నారు. పెద్దపల్లి ఆసుపత్రిలో గర్భిణుల కోసం టిఫ్ఫా స్కానింగ్ అందుబాటులో ఉందని, డయాగ్నొస్టిక్ హబ్ ద్వారా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, డయాలసిస్ కేంద్రం ద్వారా రోజుకు 15 మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సేవలను ప్రజలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని అనవసరంగా ప్రైవేటు ఆసుపత్రులలో తమ డబ్బును వృధా చేసుకోవద్దని కలెక్టర్ పేర్కొన్నారు.

అనంతరం శాసనసభ్యులు విజయరమణారావు మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా లభిస్తున్నాయని ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని, అన్ని రకాల శస్త్ర చికిత్సలు, అన్ని రకాల పరీక్షలు ఈ జిల్లా ఆస్పత్రిలో నిర్వహించబడుతున్నాయని, ప్రజలు ఈ సౌకర్యాలను పూర్తిస్థాయిలో ప్రజలు, ఇప్పటి నుండి నవజాత శిశువులకు కూడా అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని వీటిని ప్రజలు వినియోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి, పిల్లల వైద్య నిపుణులు, సంబంధిత  అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.