ముద్ర కూకట్‌పల్లి:
రంగుల పండుగ హోలీ వేళ నగరంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఈవెంట్ పేరుతో సామాన్య ప్రజలను మోసం చేసిన నిర్వాహకుడిపై కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలికులు థెలిపిన వివరాల ప్రకారం.. ఖైతలాపూర్ గ్రౌండ్స్‌లో “రాధాకృష్ణ ఉత్సవ్ 2.0” పేరుతో హోలీ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఎన్. సాయి కుమార్ తండ్రి అంజయ్య సోషల్ మీడియా మరియు బుక్ మై షో ద్వారా ప్రచారం చేశారు. మార్చి 4వ తేదీ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రముఖ ‘రాధాకృష్ణ’ సీరియల్ నటీనటులు పాల్గొంటారని, అలాగే టికెట్ కొనుగోలు చేసిన వారికి భోజన సదుపాయం కల్పిస్తామని నమ్మబలికారు.
దీనిని నమ్మిన శీలా అర్జున్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి మొత్తం Rs 7,446/- చెల్లించి టికెట్లు కొనుగోలు చేశారు. అయితే, తీరా అక్కడికి వెళ్ళాక చూస్తే.. ప్రకటనలో చెప్పిన విధంగా సీరియల్ నటీనటులు రాలేదు, కనీసం భోజన ఏర్పాట్లు కూడా లేవు. తమను మోసం చేసినట్లు గుర్తించిన బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిందితుడు: ఎన్. సాయి కుమార్ (నిర్వాహకుడు)
బాధితుడు: శీలా అర్జున్
వేదిక: ఖైతలాపూర్ గ్రౌండ్స్, కూకట్‌పల్లి
మోసం చేసిన తీరు: నటీనటుల రాక మరియు ఆహార సదుపాయం విషయంలో తప్పుడు హామీలు ఇచ్చి టికెట్ల విక్రయం.
బాధితుడి ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసును ఎస్‌ఐ కె. గిరీష్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు.
ఈవెంట్ల పేరుతో జరిగే ఇటువంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,పోలీసుల విజ్ఞప్తి చేసారు. బాధితులు ఎవరైనా ఉంటే పోలీసులను సంప్రదించాలని కోరారు.