ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం -మరో ఆరు నెలల్లో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో తులం బంగారం -స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కక్కటిగా అమలు చేస్తున్నామని, మరో నెలల్లో కల్యాణలక్ష్మి,షాదీముభారక్ తో పాటు తులం బంగారం ఇస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. బుధవారం వికారాబాద్ మండలానికి చెందిన 72 కళ్యాణలక్ష్మి, 09 షాదిముబారక్ చెక్కులను 30 సీ ఎం ఆర్ ఎఫ్ చెక్కులను ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ పంపిణీ చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, లబ్ధిదారులతో కలిసి పంపిణీ చేశారు. ఈసందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చాం. ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. రైతులకు పెద్ద ఎత్తున రుణమాఫీ జరిగిందన్నారు. మిగిలిన గ్యారంటీలను అమలు చేద్దామని ఉన్నా గతంలో పదేళ్ళు అధికారంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందన్నారు. ప్రస్తుత బడ్జెట్లో ఎక్కువ భాగం అప్పులకు సంబంధించిన అసలు, మిత్తిలకే పోతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్ధుడు కాబట్టి ఇప్పుడిప్పుడే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గాడిలో పడుతుందన్నారు.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు చక్కబడగానే ఇంకో ఆరు నెలల తరువాత ఇచ్చిన మాట ప్రకారం కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం, కాలేజీలకు వెళ్ళే ఆడ పిల్లలకు స్కూటీలను పంపిణీ చీస్థామన్నారు దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు వస్తాయని, రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యాన్ని అందిస్తున్నామని, గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్ళు అని పేదలను మోసం చేసిందని ద్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎలా అయితే ప్రతి గ్రామంలో పరిపూర్ణంగా అందరికీ ఇందిరమ్మ ఇళ్ళు ఎలా మంజూరు అయ్యాయే అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో ప్రతి నిరుపేదకు కూడా ఇళ్ళు వస్తాయన్నారు.
కళ్యాణలక్ష్మీ, షాధీముబారక్ ల మంజూరు విషయంలో మీరు ఏ మధ్యవర్తుల దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. దరఖాస్తు చేసుకుంటే నేరుగా మీ పేరు మీద చెక్కు వస్తుంది. వచ్చే మూడేళ్ళే కాదు తరువాత మరో అయిదేళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అధికారంలోకి ఉంటుందన్నారు.