యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం… జీవన శైలిలో యోగ ఒక భాగంగా అలవార్చుకోవాలి… జిల్లా అదనపు కలెక్టర్ రాజ గౌడ్…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని జిల్లా అదనపు కలెక్టర్ రాజ గౌడ్ అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం, ఆయుష్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని యోగా భవన్‌లో శుక్రవారం యోగా ప్రదర్శన జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) బి. రాజ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా ఆయుష్ వైద్య శిబిరాన్ని DMHO సుజాత తో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) బి. రాజ గౌడ్ ప్రారంభించారు. ఈ శిబిరంలో హోమియోపతి, ఆయుర్వేదం, ఇతర ఆయుష్ వైద్య విధానాల ద్వారా ప్రజలకు ఉచిత వైద్య సేవలు, ఔషధాలు అందించడం జరుగుతుందని వివరించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం యోగ చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, రోజువారి జీవనశైలిలో యోగ ప్రక్రియను ఒక భాగంగా అలవార్చుకోవాలని అన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణలో ఆయుష్ వైద్య విధానాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. యోగా, ఆయుర్వేదం, హోమియోపతి వంటి సంప్రదాయ వైద్య పద్ధతులు ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు జీవనశైలిని మెరుగుపరుస్తాయని,
ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ మెగా ఆయుష్ వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సులభంగా వైద్య సేవలు అందించడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యమని వివరించారు. ప్రజలందరూ యోగా వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో DMHO సుజాత, వివిధ జిల్లా స్థాయి అధికారులు, సంబంధిత శాఖ అధికారులు, వైద్యులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.