Take a fresh look at your lifestyle.

‘సాయుధ’ దిగ్బంధంలో కర్రెగుట్ట

  • సరిహద్దులు జల్లెడ.
  • 20 వేల మంది భద్రతా బలగాల కూంబింగ్.
  • వెయ్యి మంది మావోయిస్టులున్నారని అనుమానాలు.
  • ధర్మతాళ్లగూడెంలో ఎన్​కౌంటర్.
  • ఆరుగురు మావోయిస్టుల మృతి.
  • బార్డర్​లో తీవ్ర ఆందోళనకరంగా పరిస్థితి.
  • చుట్టూ గ్రామాలకు రాకపోకలు బంద్‌.
  • కొనసాగుతున్న కర్రెగుట్ట ఆపరేషన్.​

ముద్ర, తెలంగాణ బ్యూరో : దేశంలో టెర్రరిస్టుల దాడి సంచలనం రేపుతుంటే.. ఇటు తెలంగాణ, చతీస్​గఢ్​ సరిహద్దుల్లో మావోయిస్టుల ఏరివేతపై కేంద్ర బలగాలు జల్లెడ పడుతున్నాయి.ఛత్తీస్‌గఢ్‌లో అతిపెద్ద యాంటీ-నక్సల్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది.బీజాపుర్‌ అడవుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు దాక్కున్నట్లు సమాచారంతో మూడు రోజుల నుంచి భద్రతా బలగాలు కూంబింగ్‌ చేపట్టాయి. కర్రెగుట్టపై దాదాపుగా వెయ్యి మంది మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో పాటుగా డ్రోన్​కెమెరా విజువల్స్​తో వచ్చిన చిత్రాలు, వీడియోలతో అక్కడ మావోయిస్టులను సుమారు 20వేల మంది భద్రతా సిబ్బంది చుట్టుముట్టినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో గురువారం ఉదయం ధర్మతాళ్లగూడెం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు.ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.బీజాపుర్‌ జిల్లా ఊసూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి వచ్చే కర్రెగుట్టల కేంద్రంగా అగ్రనేతలు, మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నారనే సమాచారంతో కేంద్ర పారామిలటరీ బలగాల నేతృత్వంలో ఈ ఆపరేషన్‌ చేపట్టారు. కర్రెగుట్టలలో దాదాపు 1000 మంది మావోయిస్టులు పార్టీ గెరిల్లా దళపతి, అగ్రనేత హిడ్మా నేతృత్వంలో వీరంతా అక్కడకు చేరినట్లు తెలుస్తోంది.వీరిలో కమాండర్‌ స్థాయి నేతలు, మావోయిస్టు అగ్ర నాయకులు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చింది.దీంతో ఈ ప్రాంతంలో కూంబింగ్‌ ఆపరేషన్‌ చేపట్టారు.భీమవరంపాడు, పూజారీ కాంకేర్‌, పామేడు అటవీ ప్రాంతాల్లో కాల్పుల మోత మోగుతోంది. కూంబింగ్‌ నేపథ్యంలో కర్రెగుట్ట దండకారణ్యంలోని పలు గ్రామాలకు రాకపోకలను నిలిపివేశారు.గాలింపు చర్యల్లో డీఆర్‌జీ బస్తర్ ఫైటర్ కోబ్రా, సీఆర్పీఎఫ్‌, ఎస్టీఎఫ్‌ సైనికులతో పాటు ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు పాల్గొన్నారు. 48 గంటలుగా ఈ కూంబింగ్‌ కొనసాగుతోంది. మందుపాతరలు అమర్చామని ఇప్పటికే మావోయిస్టులు లేఖల ద్వారా ప్రకటించారు.ప్రజలెవరూ అటవీ ప్రాంతంలోకి రావొద్దని హెచ్చరించారు.దీంతో గాలింపు అత్యంత అప్రమత్తంగా కొనసాగుతోంది.బుధవారం నాటికి 12 వేల మందితో కూంబింగ్‌ చేపట్టగా.. గురువారం ఉదయం అదనంగా మరో 8 వేల మందిని రప్పించారు.దీంతో ఈ 20 వేల మంది భద్రతా సిబ్బంది కర్రెగుట్టల అటవీప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు సమాచారం. బస్తర్‌, అబూజ్‌బడ్‌ దండకారణ్యంపై హిడ్మాకు పూర్తి అవగాహన ఉంది. అతడి టార్గెట్‌గానే ఈ ఆపరేషన్‌ చేపట్టినట్లు సమాచారం.హిడ్మాతో పాటు మావోయిస్టు బెటాలియన్‌ చీఫ్‌ దేవాను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.

  • కర్రెగుట్టల్లో క్షణక్షణం.. టెన్షన్‌ టెన్షన్‌.

కర్రెగుట్టల్లో సాయుధ పోలీసు బలగాలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి.ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఈ ఆపరేషన్​ను చేస్తున్నట్లు తెలుస్తున్నది.దీని కోసం హెలికాప్టర్లను, డ్రోన్లను వినియోగిస్తున్నారు. భద్రతా బలగాలు పలుమార్లు కర్రె గుట్టలపైకి బాంబులను విసిరుతున్నట్లు తెలుస్తున్నది.మూడు రోజులుగా వేలమంది సాయుధ బలగాల దిగ్భంధంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ సరిహద్దు అటవీప్రాంతంలోని కర్రెగుట్టల్లో ఏం జరుగుతోందనే ఆందోళన తీవ్రమవుతోంది.వివిధ వర్గాల్లో హై టెన్షన్ నెలకొంది.బయటి సమాజంలో కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కర్రెగుట్టల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులతో పాటు ముఖ్యమైన నాయకులున్నారనే సమాచారం మేరకు 20 వేల మంది మేరకు సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, డీఆర్జీ, కోబ్రాతో పాటు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర సాయుధ బలగాలు పకడ్బందీ ప్రణాళిక ప్రకారం చుట్టుముట్టి దిగ్బంధించినట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలో గురువారం ఉదయం ధర్మతాళ్ళ గూడెం వద్ద జరిగిన ఎన్‌కౌంటర్లలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు వార్తలు వెలువడుతున్నాయి.పామేడు, పూజారి కాంకేర్ తదితర ప్రాంతాలు కాల్పులతో దద్దరిల్లుతున్నాయని చెబుతున్నారు. కర్రెగుట్టల దిగ్భంధం అక్కడ సాగుతున్న కేంద్ర బలగాల ఆపరేషన్ పై పూర్తి స్థాయి సమాచారం బయటకు తెలియనీయడం లేదు.

  • రక్తమోడుతోన్న అటవీప్రాంతం.

మరోవైపు, అపరేషన్‌ కగార్‌ పేరుతో కొంతకాలంగా ఛత్తీస్‌గఢ్‌ అటవీప్రాంతంలో కేంద్ర సాయుధ బలగాలతో పాటు ఆ రాష్ట్ర పోలీసుల ముప్పేట దాడులతో మావోయిస్టులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.ఈ క్రమంలోనే మావోయిస్టులు రక్షణ కోసమా? లేక ఏదైనా సమావేశం కోసమా? ఏదైతేనేం..పెద్ద సంఖ్యలో కర్రెగుట్టలకు చేరుకున్నారని తెలుస్తున్నది.ఈ సమాచారం తెలిసి వేల సంఖ్యలో సాయుధ బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టడం భారీ ఎన్‌కౌంటర్‌కు సిద్ధపడటమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కర్రెగుట్టల్లో సాయుధ పోలీసు బలగాలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి.ఛత్తీస్‌గఢ్‌ నుంచి చేస్తున్నట్లు తెలుస్తున్నది.దీని కోసం హెలికాప్టర్లను, డ్రోన్లను వినియోగిస్తున్నారని సమాచారం.గుట్టలపై బాంబులతో దాడి చేస్తున్నారని తెలుస్తున్నది.బయటి నుంచి సాయుధ పోలీసులకు అన్ని హంగులు అందుబాటులో ఉన్నందున దూసుకపోతున్నారు.మావోయిస్టులు అమర్చిన మందుపాతరలు, ఎల్‌ఈడీలను నిర్వీర్యం చేస్తూ చొచ్చుకపోతున్నారు. బాంబులు, తుపాకుల మోతతో కర్రెగుట్టలు దద్దరిల్లుతున్నాయి.సీఆర్పీఎఫ్, ఛత్తీస్‌గఢ్‌ పోలీసు ఉన్నతాధికారులు అక్కడే తిష్ఠవేసి..సాయుధ బలగాలకు డైరెక్షన్స్‌ ఇస్తున్నారు.అటు మావోయిస్టులు కూడా సాయుధ పోలీసు బలగాలను తుపాకులతో అడ్డుకుంటుండటంతో ఇరువైపులా కాల్పుల మోతతో కర్రెగుట్టలు దద్దరిల్లుతున్నాయి.మావోయిస్టులను ఒంటరి చేసేందుకు గ్రామాలు, గూడేలతో సంబంధం లేకుండా రాకపోకలను నిలిపివేసినట్టు తెలుస్తున్నది. కర్రెగుట్టల్లో ఎంతమంది మావోయిస్టులు ఉన్నారనేది తెలియని పరిస్థితి.వారంతా అక్కడ దిగ్బంధానికి గురైన పరిస్థితిలో పోలీసు బలగాలతో తలపడటమో లేక లొంగిపోవడమో తప్ప వేరే దారి లేకుండా పోయిందని చెబుతున్నారు.లొంగిపోయినా ప్రాణాలు దక్కుతాయా? లేదా? తెలియని ఒక రకమైన యుద్ధ వాతావరణం కర్రెగుట్ట ప్రాంతంలో ఉన్నట్లు చెబుతున్నారు.

  • తెలంగాణ పోలీసులకు సంబంధం లేదు.

ఇదిలా ఉండగా సాధారణంగా నిర్వహించే కూంబింగ్‌ మాత్రమే కొనసాగిస్తున్నామని, కర్రెగుట్ట ఆపరేషన్‌కు తెలంగాణ పోలీసు బలగాలకు సంబంధం లేదని రాష్ట్ర మల్టీజోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గురువారం వరంగల్‌లో మీడియాకు చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌, కేంద్ర బలగాల నుంచి తమకు ఎలాంటి సమాచారం కూడా లేదనడం గమనార్హం.

Leave A Reply

Your email address will not be published.