Take a fresh look at your lifestyle.

మే రెండో వారంలో సర్కార్​ చేతికి కాళేశ్వరంపై విచారణ నివేదిక

  • తుది అంకానికి చేరిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ
  • మాజీ సీఎం కేసీఆర్,మాజీ మంత్రులు హరీశ్,ఈటలను ప్రశ్నించనున్న కమిషన్
  • ఇప్పటికే అధికారులు, నిర్మాణ సంస్థలు, నిపుణుల విచారణ పూర్తి
  • ఇప్పటికే 400 పేజీలతో నివేదిక రెడీ

ముద్ర, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగాలైన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణాల అవకతవకలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ తుది దశకు చేరుకున్నది.ఇప్పటికే అధికారులు, నిర్మాణ సంస్థలు, నిపుణులను ప్రశ్నించిన కమిషన్..తుది దశ విచారణ మొదలు పెట్టింది.ఇప్పటికే చేపట్టిన విచారణలో తేలిన అంశాల ఆధారంగా 400 పేజీల నివేదికను కమిషన్ సిద్ధం చేసింది. దాదాపు 90 శాతం రిపోర్టు పూర్తిచేసిన కమిషన్..నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) తుది నివేదిక కోసం ఎదురుచూస్తున్నది.ఈ మేరకు తుది నివేదిక కోసం కమిషన్, ఎన్డీఎస్ఏ‌కు మరోసారి లేఖ రాసింది.ఆ నివేదిక మరో మూడు వారాల్లో వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఫైనల్ రిపోర్టును అందజేయనుంది.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణ కోసం 2024 మార్చి 12న జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది.వివిధ కారణాలతో విచారణ ఆలస్యం అవుతుండటంతో ఇప్పటికే పలుసార్లు కమిషన్ గడవును పొడిగించగా ఈ నెలాఖరుతో గడవు ముగియనుంది. ఈనేపథ్యంలో మరోసారి ప్రభుత్వం కమిషన్ గడవు పొడిగించనున్నట్లు తెలిసింది.కాగా ప్రస్తుతం విచారణ కీలక దశకు చేరుకున్నది. ఈ దశలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్‌ను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నది.ఈ దఫాలోనే వారికి సమన్లు పంపించి విచారణకు రావాలని కోరనుంది.ఇప్పటికే పలు దఫాలుగా నిర్వహించిన క్రాస్‌ ఎగ్జామినేషన్‌లో బరాజ్‌ల నిర్మాణంలో భాగస్వాములైన నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్‌సీలు, చీఫ్‌ ఇంజనీర్లు, ఇతర ఇంజనీర్లతోపాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించిన కమిషన్‌ కీలక సాక్ష్యాధారాలు సేకరించింది. తుది విచారణలొ భాగొంగా వీటిని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్, ఈటల ముందు ఉంచి ప్రశ్నించనున్నట్టు తెలిసింది.

  • ఎన్నికల ముందే డ్యామేజీ..!

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ. లక్షల కోట్ల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ 2023 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు దెబ్బతిన్నది.ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ ప్రాజెక్ట్‌లోని పిల్లర్లు కుంగాయి.ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భారీగా అవినీతి చోటు చేసుకుందని..అందుకే ఈ విధంగా కృంగిందంటూ ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పించాయి.అయితే తాము అధికారంలోకి వస్తే..ఈ వ్యవహారంపై విచారణ చేపడతామంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చింది.ఇంతలో ఎన్నికలు వచ్చాయి.రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.అనంతరం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం..అ నాటి సంఘటనలపై విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్‌ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఈ క్రమంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో పాలు పంచుకొన్న ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, సంబంధిత విభాగాల ఇన్ ఛార్జీలు, గుత్తేదారులను విచారించింది.

Leave A Reply

Your email address will not be published.