Take a fresh look at your lifestyle.

ఆహార భద్రత,సాంస్కృతిక వారసత్వ సంరక్షకులు రైతులు

  • వ్యవసాయ రంగ అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి పనిచేసింది.
  • గ్రీన్ రెవల్యూషన్, ఉపాధి హామీ, రైతు రుణమాఫీ, వ్యవసాయ కమిషన్ కాంగ్రెస్ చలువే.
  • దేశ ఆర్థిక నిర్మాణంలో వ్యవసాయ భాగస్వామ్యం తగ్గుతుంది.
  • కేరళ రాష్ట్ర రైతులు కార్మికుల మహాసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.

ముద్ర, తెలంగాణ బ్యూరో : రైతులు మన ఆహార భద్రత, సాంస్కృతిక వారసత్వానికి సంరక్షకులు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం కేరళ రాష్ట్రం కోజీకోడ్ జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతులు, కార్మికుల మహాసభలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా భట్టి విక్రమార్క ప్రసంగించారు. ప్రతి రైతు అభివృద్ధి ప్రయాణంలో మనం భాగస్వామి కావాలన్నారు. ఏ కార్మికుడు ఒంటరిగా ఉండకూడదన్నారు. కర్షకుడిని రక్షించి, కార్మికుడిని కాపాడండి అనే నినాదం ఈ సదస్సుకు కొత్త దిక్సూచి కావాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. కాంగ్రెస్​ తీసుకువచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ప్రతి గ్రామస్తునికి వంద రోజుల ఉపాధి హామీని కల్పించిందన్నారు. ప్రపంచంలోనే ఇది ప్రధమ నిబంధన అన్నారు. ఈ పథకం గ్రామీణుల వేతనాలు పెంచి, వలసలను తగ్గించిందన్నారు. అలాగే వ్యవసాయ రంగానికి తోడ్పాటును అందించిందని చెప్పారు. తెలంగాణలో ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేసి ఉపాధి,ఆదాయాన్ని స్థిరంగా అందిస్తున్నట్లు సీఎం వివరించారు. డిజిటల్ నమోదు ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు బీమా, పెన్షన్ సహకారం అందిస్తున్నట్టు తెలిపారు. ఆత్మీయ రైతు భరోసా పథకం ద్వారా భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఎకరానికి 12,000 ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. జిగ్ వర్కర్ల హక్కులను గుర్తించి, వారికి ఆరోగ్య భీమా, సామాజిక భద్రత కల్పించే విధానాలను రూపొందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో వ్యవసాయం ఒక జీవన విధానం అన్నారు. అలాంటి వ్యవసాయ రంగం నేడు అకాల వర్షాలు, పెరిగిన పెట్టుబడులు, మార్కెట్ ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు, మారిన వాతావరణ ప్రభావం వంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుందని వివరించారు. భారతదేశ ఆర్థిక నిర్మాణంలో వ్యవసాయ భాగస్వామ్యం క్రమంగా తగ్గుతుంది అన్నారు. 2016లో 17.5శాతం కాగా ప్రస్తుతం అది 14శాతంగా నమోదైందని చెప్పారు.అయినప్పటికీ సగం జనాభా వ్యవసాయ రంగంతోనే ముడి వేసుకుని ఉన్నారని తెలిపారు. స్వాతంత్య్రానంతరం వ్యవసాయ రంగ అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి పని చేసిందన్నారు. ఇందిరాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి వంటి నేతల సారథ్యంలో హరిత విప్లవాన్ని సహకారం చేశారని, అధిక ఉత్పత్తి ఇచ్చే విత్తనాలు, మెరుగైన నీటిపారుదల వ్యవస్థ, ఎరువులు అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. ఈ చర్యలతో ధాన్యం ఉత్పత్తి 55 మిలియన్ టన్నుల నుంచి 1978- 79 నాటికి 131 మిలియన్ టన్నులకు పెరిగిందన్నారు.ఈ పరిణామం కేవలం వ్యవసాయం వృద్ధికే కాకుండా గ్రామీణ ఉపాధిని ఆర్థిక శక్తిని బలోపేతం చేసింది అని అన్నారు.రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు కాంగ్రెస్ కృషి చేసిందన్నారు. 1965 లో లాల్ బహుదూర్ శాస్త్రి మద్దతు వ్యవసాయ ధరల కమిషన్ ను స్థాపించారని చెప్పారు.ఇందిరా, రాజీవ్ గాంధీల హయాంలో వ్యవసాయ ధరల కమిషన్ ను మరింత బలోపేతం చేశారని తెలిపారు.రైతులను స్వతంత్రులను చేసేందుకు రుణమాఫీ అవసరం అని భట్టి అబిప్రాయపడ్డారు.2008లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం రూ.71వేల కోట్ల రుణాలను మాఫీ చేసిందన్నారు.దీని ద్వారా దేశంలో 3.68 కోట్ల మంది రైతులకు ఉపశమనం కలిగిందన్నారు.ఈ సమావేశంలో ఎంపీ ఆంటోని జోసఫ్ ఎమ్మెల్యే సన్నీ జోసెఫ్, డిసిసి అధ్యక్షుడు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.