Take a fresh look at your lifestyle.

బిఆర్ఎస్ లో “జోష్”

  • గులాబీల్లో కొత్త ధైర్యం
  • స్థానిక సంస్థలపై రజతోత్సవ జోష్​ 
  • మొన్నటిదాకా సైలెంట్​ 
  • ఎల్కతుర్తి సభతో మళ్లీ ఉత్సాహం 
  • కేటీఆర్​, హరీశ్​ వర్గ విభేదాలపైనే కొంత అసహనం 
  • మళ్లీ సెగ్మెంట్లకు తరలుతున్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు
ముద్ర, తెలంగాణ బ్యూరో: ఒక్క భారీ బహిరంగ సభ సక్సెస్ గులాబీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం తొణకిసలాడుతోంది. నిన్నా, మొన్నటి వరకు పార్టీ  కార్యకర్తల్లో ఎక్కడో ఒక  చోట చిన్నా చిన్నా అనుమానాలు ఉండేవి.అయితే వాటన్నింటిని పటాపంచలు చేస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్క తుర్తిలో జరిగిన పార్టీ రజతోత్సవ కార్యక్రమానికి ప్రజలు లక్షలాదిగా హాజరయ్యారు. ప్రస్తుతం ఇదే గులాబీ శ్రేణుల్లో మంచి జోష్ ను నింపుతోంది.పైగా రాష్ట్రంలో స్థానిక సంస్థలు తరుముకొస్తున్న వేళ ఈ సభ సక్సెస్ పార్టీకి మంచి ఆక్సిజన్ వస్తుందన్న ధీమా పార్టీ శ్రేణుల్లో  నెలకొంది.దాదాపు సంవత్సరన్నర కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ అధికారాన్ని కోల్పోయింది.తదనంతరం ఆరేడు మాసాల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ పలు నియోజకవర్గాల్లో డిపాజిట్లను కోల్పోవడమే కాకుండా మరికొన్ని నియోజకవర్గాల్లో మూడవ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.దీంతో పార్టీ భవిష్యత్తుపై నిలనీడలు కమ్ముకున్నాయి.దీంతో పలువురు గులాబీ నేతలు నెమ్మదిగా పార్టీని వీడి అధికార పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.సిట్టింగ్ శాసనసభ్యులతో పలువురు మాజీ శాసనసభ్యులు, ముఖ్యనేతలంతా కారు దిగి హస్తం గూటికి చేరుకున్నారు.దీంతో పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి శాసనసభ్యులు ఎవరూ పార్టీని వీడకుండా కాపాడుకోవాల్సి వచ్చింది.వారిని బుజ్జగించుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ పలువురు శాసనసభ్యులు కప్పదాటి వైఖరితోనే కాలాన్ని సాగదీస్తున్నారు.మరోవైపు పార్టీ అగ్రనేతలపై కేసులు నమోదు అవుతుండడంతో గులాబీ పార్టీ కొంత కాలం పాటు కకావికలమైంది.దీంతో పార్టీ భవిష్యత్తుపై అనేక అనుమానాలు కమ్ముకున్నాయి.ఇలాంటి తరుణంలో  అధికార కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలతో బీఆ్ఎస్ కు ఒక్కసారిగా చేతికి అస్త్రం లభించినట్లు అయింది.అదే సమయంలో ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో  సంక్షేమ పథకాలు అందకపోవడంతో  కాంగ్రెస్ పై సహజంగానే ప్రజల్లో అసంతృప్తి  నెలకొంది.ముఖ్యంగా పెన్షన్లు పెంపు లేకపోవడం కొత్తగా ఎవరికి పెన్షన్లు ఇవ్వకపోవడం రైతులకు సకాలంలో రైతు బంధు వంటి పథకాలు రాకపోవడం కళ్యాణ లక్ష్ణీ, షాదీ ముబారక్ వంటి పథకాలు అందకపోవడంతో ప్రజల్లో మరింత ఆగ్రహవేశాలు నెలకొన్నాయి.ఇదే అదనుగా భావించిన గులాబీ పార్టీ రాజకీయంగా స్పీడ్ అందుకుంది.ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆరోపణలు, విమర్శలు చేస్తూ పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలకు దిగింది. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో గులాబీ నేతల్లో   భవిష్యత్త్ పై తిరిగి ఆశ నెలకొంది. దీంతో కొంతకాలంగా మౌనంగా అగ్రనేతలు సైతం ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూ మీడియాలో ప్రతి రోజు నిలుస్తూ రాజకీయంగా హల్ చల్ చేస్తున్నారు.ఈ మార్పు క్రమంగా పార్టీ కింది స్థాయి నేతలకు వరకు పాకింది.దీంతో గులాబీ పార్టీ తిరిగి కింది స్థాయి నుంచి యాక్టివ్ అవుతున్నట్లు కనిపిస్తోంది.ఇదే సమయంలో పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో నిర్వహించిన రజతోత్సవ సభకు అంతా ఊహించిన విధంగానే  భారీగా ప్రజలు తరలి వచ్చారు.ఈ జన సమూహాన్ని చూసి ప్రస్తుతం గులాబీ శ్రేణుల్లో  సంతోషంతో తబ్బుబ్బి అవుతున్నారు. ఈ జనవాహిని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తిరిగి అధికారంలోకి తీసుకొస్తుందన్న ధీమా వారిలో నెలకొంది. దీంతో  గులాబీ శేణులది ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే ఇక మీదట మరో ఎత్తు అన్న చందంగా వారిలో ఉత్సాహం ఊరకలు వేస్తోంది.ఈ జోష్ తో ఇక రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా అందులో గులాబీదే విజయమన్న ధీమా వారిలో వ్యక్తమవుతోంది.ఈ నేపథ్యంలోనే  పార్టీ మారిన శాసనసభ్యుల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరిగినా లేదా రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగినా  అందులో కారు దూసుకుపోవడం ఖాయమన్న ఆత్మవిశ్వాసంలో వారిలో  మరింతగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓడిన సెగ్మెంట్లకు తిరిగి మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, పార్టీ నేతలు వెళ్ళి తిరిగి ప్రజాక్షేత్రంలో వారితో మమేకం అయ్యేందుకు సిద్ధమవుతున్నారు.అయితే ఇదే సమయంలో పార్టీ అగ్రనేతలైన కేటీఆర్, హరీశ్ రావుల మధ్య తాజాగా విభేదాలు నెలకొన్నాయన్న అనుమానాలు పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి.పార్టీ రజతోత్సవ కార్యక్రమంలో పలువురు నేతల హడావిడి కనిపించినప్పటికీ హరీశ్ రావు మాత్రం సిద్దిపేట్ కు మాత్రమే పరిమితం మయ్యారు.ఇది పార్టీ శ్రేణుల్లో అనేక సందేహాలకు తావిస్తోంది.ఈ విభేదాలు నిజంగానే కొనసాగితే మాత్రం పార్టీ పరిస్థితి తిరిగి మొదటి రావడం  ఖాయమని  కొందరు నేతలు అంతర్గతంగా పరస్పరం చెవులు కొరుక్కుంటున్నారు.మరి ఈ విభేదాలు తాత్కాలికమా లేక మరింతగా ముదురి పార్టీకి మరింత నష్టం  తీసుకొస్తాయా అన్నది మునుముందు తేలనుంది.అప్పడు గానీ  ఈ సస్పెన్స్ కు తెరపడే అవకాశాలు లేవని తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.