Take a fresh look at your lifestyle.

మా ఎమ్మెల్యేలకు పొగరు, హెచ్చరించిన మారడం లేదు

  • ప్రజల్లోకి వెళ్లమంటే హైదరాబాద్​లో టైంపాస్​ చేస్తున్నారు
  • పదవులు రాలేదని నోరు జారితో వాళ్లకే ప్రమాదం
  • మావోయిస్టులతో చర్చలకు శాంతి కమిటీ ఏర్పాటు
  • ఈ అంశంపై జానారెడ్డి, కేకే పార్టీలో చర్చిస్తారు
  • ఆపరేషన్ కగార్ పై జాతీయ స్థాయిలో చర్చ కోసం అధిష్టానానికి ప్రతిపాదనలు
  • నా పాలనలో కక్షసాధింపు చర్యలుండవ్​
  • రాష్ట్ర ఆర్థిక విధ్యంసానికి కేసీఆరే కారణం
  • పదేండ్లు రాష్ట్ర ఖజానా అంతా ఖాళీ చేసి మాపై నిందలా..?
  • మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్​ చాట్

ముద్ర, తెలంగాణ బ్యూరో : తమ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలకు పొగరు పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.సీఎల్పీలో హెచ్చరించినా కొందరు తమ పనితీరును మార్చుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.చాలా మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఇది వారికీ, పార్టీకి మంచిది కాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. ఇంకొందరు పార్టీలో అంతర్గత విషయాలను బయట చర్చిస్తున్నారన్నారు. కొందరు పదవులు రాలేదని నోరుజారుతున్నారనీ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారని చెప్పారు. అలాంటి ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు తమ తీరు మార్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తామని అనుకుంటే అన్ని విధాలా నష్టపోతారని హెచ్చరించారు. సోమవారం కేశవరావుతో కలిసి కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు కె.జానారెడ్డి నివాసానికి సీఎం వెళ్లారు.అక్కడ కర్రెగుట్టపై కూంబింగ్​ నిలుపుదలతో పాటు మావోయిస్టులతో చర్చలు జరపాలరని ఈ నెల 27న తనను కలిసిన శాంతి కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలు, అపరేషన్ కగార్, శాంతి చర్చలు, కాల్పుల విరమణపై సీనియర్​ నాయకులతో చర్చలు జరిపారు.తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. పార్టీ లైన్​ దాటిన నేత ఎంతటివారైనా వారికి పార్టీ, ప్రభుత్వంలో ఎలాంటి పదవులు రావని తేల్చి చెప్పారు.భవిష్యత్తులోనే అవకాశాలు ఉండవని స్పష్టం చేశారు.పార్టీలో ఓపికతో ఉంటేనే పదవులు వరిస్తాయని చెప్పారు.తనను నమ్ముకున్న వారిని నేను ఎప్పటికీ మర్చిపోనని, నన్ను నమ్మిన వారిలో ఒకరైన దయాకర్‌కు ఎమ్మెల్సీ పదవి వచ్చిందని చెప్పారు.ఓపికగా ఉన్న వారికే తన నుండి బాధ్యతలు వస్తాయని, బయటకి వెళ్లి విమర్శలు చేస్తే తనపై బాధ్యత ఉండదని అన్నారు.కొంత మంది అధికారుల పని తీరు బాగలేదని సీఎం చెప్పారు.అయినా అనివార్య కారణాలు, అవసరంతో వారి సేవలను కొనసాగించాల్సి వస్తోందన్నారు.కలెక్టర్ల మార్పు సర్వసాధారణమని చెప్పారు. పాలనా సౌలభ్యం కోసం అవసరమైన మార్పులు చేసుకుంటామని సీఎం స్పష్టం చేశారు

  • నేనే సీఎం అయిన రోజే కేసీఆర్​ గుండె పగిలింది..!

తాను సీఎం అయిన రెండో రోజే కేసీఆర్ గుండె పగిలిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఆర్ధిక అనర్ధాలకు కేసీఆరే కారణమన్నారు.దానికి ఆయనే బాధ్యత వహించాలన్నారు.పదేండ్లు సీఎంగా ఉండి రాష్ట్ర ఖజానా అంతా ఖాళీ చేసి ఇప్పుడు మాపై నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు.ఇప్పుడు బీఆర్ఎస్‌ను నమ్మే స్థితిలో ప్రజలు లేరంటూ వ్యాఖ్యానించారు.వరంగల్ సభలో కేసీఆర్‌ అదే అభద్రతాభావంలో మాట్లాడారన్నారు.ఆయన ప్రసంగంలో స్పష్టత లేదన్నారు. ఆయన స్పీచ్ అంతా అక్కసుతో నిండి ఉందని విమర్శించారు.కేటీఆర్ పై కేసు అయినా.. ఫోన్ ట్యాపింగ్ కేసు అయినా అన్నీ చట్ట పరిధిలోనే జరుగుతాయని వివరణ ఇచ్చారు. తాను మాత్రం కక్ష సాధింపు చర్యలకు దగనని సీఎం స్పష్టం చేశారు. కేసీఆర్ లా తాను చట్టాన్ని అతిక్రమించి అరెస్టు చేయించనని చెప్పారు.కేసీఆర్ సభకు ఎన్ని బస్సులు అడిగితే అన్ని ఇచ్చామన్నారు. దాంతో ఆర్టీసికి కూడా ఆదాయం వచ్చిందన్నారు.గతంలో బీఆర్ఎస్ హయంలో రాహుల్ గాంధీ సభకు బస్సులు ఇవ్వమంటే ఇవ్వకుండా అడ్డుకున్నారని విమర్శించారు.అవసరాలకు అనుగణంగా కేసీఆర్, మోదీ మాటలు మారుస్తున్నారని మండిపడ్డారు.దేశానికి ఇందిరాగాంధీ లాంటి ప్రధాని కావాలని, రెండు దేశాలను ఓడించిన ఘనత ఇందిరాగాంధీదేనన్నారు.రాహుల్‌గాంధీకి, తనకు గ్యాప్‌ ఉందంటూ జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు.రాహుల్‌గాంధీ, తాను రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నామని చెప్పారు.ఆ విషయం బయటకు చెప్పాల్సిన అవసరం తనకు లేదంటూ సీఎం పేర్కొన్నారు. కేసీఆర్, ప్రధాని మోడీ అవసరాలకు అనుగుణంగా మాటలు మారుస్తున్నారని ఆరోపించారు.దేశానికి ఇందిరాగాంధీ లాంటి ప్రధాని అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు. కేసీఆర్ విమర్శలు ఇప్పుడు కాదు.. అసెంబ్లీకి వచ్చి చేయాలన్నారు. తాను ఇంకా 20 ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని సీఎం స్పష్టం చేశారు.

  • మావోయిస్టులతో చర్చల కోసం శాంతి కమిటీ.

మావోయిస్టులతో చర్చల కోసం శాంతి కమిటీ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.ఈ అంశంపై పార్టీ సీనియర్ నేతలు జానారెడ్డి, కే. కేశవరావు పార్టీలో చర్చిస్తారని చెప్పారు.గతంలో మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపిన అనుభవం వీరిద్దరికే ఉందన్నారు.ఇప్పుడు కూడ ఆ వ్యవహారం అంతా జానారెడ్డి, కేకే చూస్తారని చెప్పారు.ఆపరేషన్ కగార్ పై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని అధిష్టానానికి పీస్ కమిటీ ప్రతిపాదనలు పంపిస్తామని చెప్పారు.దీనిపై తమ పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వ విధానం ప్రకటిస్తామన్నారు.

Leave A Reply

Your email address will not be published.