Take a fresh look at your lifestyle.

ఏజెన్సీ రైతుల భూ సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం: కోదండ రెడ్డి

 

ముద్ర ప్రతినిధి నాగర్‌కర్నూల్,

అచ్చంపేట: నల్లమల్ల ఏజెన్సీ ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ కట్టుబడి పనిచేస్తుందని కమిషన్ చైర్మన్ ఎం. కోదండ రెడ్డి తెలిపారు.

గురువారం అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండల కేంద్రంలో ఆయన ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, రైతు కమిషన్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కోదండ రెడ్డి మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాల్లో భూమి హక్కుల గుర్తింపు, పత్రాల లోపాలు, భూ వివాదాలు రైతులకు ప్రధాన అడ్డంకులుగా మారాయని పేర్కొన్నారు. సమస్యలను కార్యాలయాల్లో కూర్చొని కాకుండా, నేరుగా రైతుల వద్దకు వెళ్లి తెలుసుకుని పరిష్కరించాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టామని తెలిపారు. రైతులు తెలియజేసిన సమస్యలను సమగ్రంగా పరిశీలించి, ముఖ్యమంత్రితో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

గిరిజన రైతుల భూ హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసిన ఆయన, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూ సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించి రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని చెప్పారు.

జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల బ్యాంకు రుణాలు అందకపోవడం వంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని, సక్సెషన్ ప్రక్రియలను పూర్తి చేసి రైతులకు రుణాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే కొన్ని గ్రామాల్లో భూములపై జాయింట్ సర్వే నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.

అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ, నల్లమల్ల ఏజెన్సీ ప్రాంతంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అవసరమని పేర్కొన్నారు. గతంలో సాగు చేస్తున్నప్పటికీ పట్టాలు లేని రైతుల సమస్యలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు. పోడు భూముల సమస్యల పరిష్కారం, అటవీ పరిరక్షణతో పాటు రైతులకు ప్రయోజనం కలిగే విధానాలు అమలు చేయాలని తెలిపారు.

ఈ సదస్సులో రైతులు తమ సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం కోరారు. అధికారులు వాటిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.