Take a fresh look at your lifestyle.

ఆసుపత్రి ప్రారంభోత్సవ ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్ బాదావత్ సంతోష్

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) భవనాన్ని త్వరితగతిన ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు.

గురువారం నాగర్ కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని తెలకపల్లి మండల కేంద్రంలో నిర్మించిన కొత్త PHC భవనాన్ని కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సదుపాయాలను సమగ్రంగా పరిశీలించి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన ఈ భవనాన్ని త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కొనసాగుతున్న 99 రోజుల కార్యాచరణలో ఆరోగ్య రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, ఆసుపత్రి ప్రారంభానికి సంబంధించి అన్ని పనులు సమయానికి పూర్తి కావాలని వైద్యాధికారులకు స్పష్టం చేశారు.

అలాగే ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలని, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం నిర్వహించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమ నిర్వహణ, ప్రజల సౌకర్యాలు, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించి పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

ఈ ఆసుపత్రి ప్రారంభంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలు అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ సందర్శనలో జిల్లా డిఎంహెచ్వో డాక్టర్ రవి నాయక్, స్థానిక వైద్యులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.