Take a fresh look at your lifestyle.

రెండు పడక గదుల ఇండ్లు అద్దెకిస్తే కేటాయింపు రద్దు–జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

ఇందిర మహిళా శక్తి భవన నిర్మాణం వేగవంతం కావాలి.

మెడికల్ కళాశాల విద్యార్థుల, సిబ్బంది హాజరు నివేదించాలి.

 

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ ప్రతినిధి:

గద్వాల పట్టణ శివారులోని రెండు పడక గదుల ఇండ్ల సమీపంలో జిల్లా ఆసుపత్రి, మెడికల్, నర్సింగ్ కళాశాలలు, సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ భవనాలు నిర్మించడంతో ఈ ప్రాంతం మెడికల్ హబ్ గా అభివృద్ధి చెందబోతోందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.

గురువారం గద్వాల శివారులో రూ. 5.7 కోట్ల నిధులతో నిర్మిస్తున్న ఇందిర మహిళా శక్తి భవనంతో పాటు పక్కనే కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. అలాగే మెడికల్, నర్సింగ్ కళాశాలల భవనాలు, రెండు పడక గదుల ఇండ్ల సముదాయంను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిర మహిళా శక్తి భవన నిర్మాణం నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని గుత్తేదారును ఆదేశించారు. ఈ భవనం ప్రారంభించుకున్నాక మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు వివిధ సందర్భాల్లో శిక్షణ కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. భవనంలో నిర్మిస్తున్న డార్మెటరీ హాల్స్, ఓపెన్ డైనింగ్, కిచెన్, తదితర గదులను తిరిగి పరిశీలించారు. భవనం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి, ఫర్నిచర్, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన నిధులకై ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలం కావలసి ఉండడంతో రెవెన్యూ అధికారులు ప్రతిపాదించిన స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. మ్యాప్ ద్వారా పూర్తి వివరాలను సంబంధిత అధికారులు కలెక్టర్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భవన నిర్మాణ డిజైన్ పూర్తయితే ప్రతిపాదిత స్థలం వద్ద రహదారుల నిర్మాణానికి ప్రతిపాదనలు చేయవచ్చన్నారు. 2026-2027 విద్యా సంవత్సరంలోనే కేంద్రీయ విద్యాలయ తరగతులు ప్రారంభించాల్సి ఉన్నందున భవన నిర్మాణం పూర్తయ్యే వరకు గోనుపాడు గ్రామం వద్ద ఉన్న గద్వాల మండల కస్తూరిబా విద్యాలయ భవనంలో తాత్కాలికంగా తరగతులు నిర్వహించాలన్నారు. కలెక్టరేట్ సమీపంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న నర్సింగ్ కళాశాల భవనంలో కస్తూరిబా విద్యాలయ నిర్వహణకు పరిశీలించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

అనంతరం సమీపంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవనంలో తాత్కాలికంగా నిర్వహిస్తున్న మెడికల్ కళాశాలను కలెక్టర్ సందర్శించారు. విద్యార్థుల, సిబ్బంది హాజరు నివేదికను ఎప్పటికప్పుడు తమకు పంపాలని ఆదేశించారు. కళాశాలలోని వివిధ విభాగాల్లో పనిచేసే ఔట్సోర్సింగ్ సిబ్బంది నియామకానికి ఉన్న సమస్యలను పరిష్కరించి నిబంధనల ప్రకారం నియామకాలు చేపట్టాలన్నారు. అనంతరం మెడిసిన్ విద్యార్థులకు తరగతి గదిలో నిర్వహిస్తున్న క్విజ్ పోటీలను కలెక్టర్ కాసేపు కూర్చుని పరిశీలించారు. ప్రస్తుత భవనం ముందు రూ.140 కోట్ల అంచనా తో నిర్మించే మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా పలువురు మెడిసిన్ విద్యార్థులు తమ సమస్యలపై కలెక్టర్ కు వినతిపత్రాలు ఇవ్వగా పరిశీలించి పరిష్కరిస్తామన్నారు.

అలాగే పక్కనే రూ.12 కోట్లతో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్ భవనాన్ని కలెక్టర్ పరిశీలించారు. నర్సింగ్ కళాశాల అకాడమిక్, వసతి గృహ భవనాల నిర్మాణ పనులు మిగిలి ఉంటే వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నర్సింగ్ కళాశాల భవనంలో వివిధ విభాగాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. అనంతరం సమీపంలోని సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ భవనాన్ని సందర్శించి అక్కడి అధికారులతో మాట్లాడారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలలకు ఇక్కడి నుంచే మందులను, ఇతర మెడికల్ సామాగ్రిని సరఫరా చేస్తున్నందున తగు సూచనలు చేశారు.

చివరగా రెండు పడక గదుల ఇండ్లను సందర్శించిన జిల్లా కలెక్టర్ అక్కడి పలువురు లబ్ధిదారులతో మాట్లాడారు. డిప్పు విధానంలో రెండు పడక గదుల ఇండ్లను కేటాయించబడ్డ అర్హులైన లబ్ధిదారులే నివాసం ఉండాలని, అద్దెకు ఇవ్వడం, అమ్ముకోవడం వంటివి చేస్తే కేటాయింపు రద్దుచేసి ఇతర అర్హులైన లబ్ధిదారులకు ఆ ఇండ్లను ఇవ్వడం జరుగుతుందన్నారు. రెండు పడక గదుల ఇండ్ల సముదాయం వద్ద నీటి సమస్యను పలువురు లబ్ధిదారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రింగ్ రోడ్డు సమీపంలో మెడికల్ హబ్ గా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో రెండు పడక గదుల సముదాయం నిర్మించడంతో ఈ ప్రాంతానికి భవిష్యత్తులో ఎంతో ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఇలాంటి విలువైన ప్రదేశంలో నిర్మించిన రెండు పడక గదుల ఇండ్లను వినియోగించుకోకుండా దుర్వినియోగం చేయడం తగదన్నారు. లబ్ధిదారులకు ఏ సమస్య ఉన్న పరిష్కరిస్తామని, నివసించకుండా ఉన్నవాళ్లు నెల రోజుల్లోగా గృహప్రవేశాలు చేసుకోవాలని లేదంటే వారికి కేటాయించిన ఇండ్లను ఇతర అర్హులైన వారికి కేటాయింపు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ పర్యటనలో ఆర్డీవో శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ ఈఈ ప్రభాకర్, డిఈ లక్ష్మన్న, డీఈవో విజయలక్ష్మి, టిజి ఎంఎస్ ఐడిసి డిఈ శ్రీనివాసులు, ఏఈ రహీం, మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ నాగేశ్వరరావు, పర్యవేక్షకులు ఇందిర, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ హనుమంతమ్మ, గద్వాల తహసిల్దార్ హరికృష్ణ, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.