Take a fresh look at your lifestyle.

జూన్ 8, 9వ తేదీల్లో చేప ప్రసాదం

  • నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో విస్త్రత ఏర్పాట్లు.
  • మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కార్యక్రమం పర్యవేక్షణ.
  • మొదటి విడతగా ఒక లక్షా 25 వేల చేప పిల్లలు సిద్దం చేసిన మత్స్యశాఖ.
  • మీడియా వివరాలు వెల్లడించిన బత్తిన సోదరులు.

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఈ సంవత్సరం మృగశిర కార్తీ జూన్ 8వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రవేశిస్తుందని, ఆ రోజనే చేప ప్రసాదం పంపిణీ చేస్తామని బత్తిన సోదరులు వెల్లడించారు. ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో దివంగత బత్తిన హరినాథ్ గౌడ్ తనయుడు బత్తిని అమర్నాథ్ గౌడ్, కుటుంబ సభ్యులు కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమర్నాథ్ గౌడ్ మాట్లాడుతూ.. ఎప్పటిలానే ఈ సంవత్సరం జూన్ 8 తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు మృగశిర కార్తీ ఘడియలు ప్రవేశించిన వెంటనే చేప ప్రసాదం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఇవ్వబడుతుందని చెప్పారు. దూద్ బౌలిలోని వారి ఇంటి వద్ద జూన్ 7వ తేదీన సత్యనారాయణ వ్రతం, పూజ్ అనంతరం చేప ప్రసాదం తయారీ చేస్తామన్నారు. జూన్ 8, 9 తేదీలలో రెండు రోజుల పాటు చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. చేప ప్రసాదం స్వీకరించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనం వస్తారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లుు చేస్తుందన్నారు. అనంతరం శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యవేక్షణలో చేప ప్రసాద కార్యక్రమం నిర్వహించబతుందని చెప్పారు. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ చేప ప్రసాదం అందజేస్తామన్నారు. జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఆర్టీసీ, మున్సిపాలిటీ, పోలీస్, విద్యుత్ శాఖతో పాటు మత్స్య శాఖ వారు కావాల్సిన చేపల్ని సిద్ధం చేస్తున్నారని ఆయన తెలిపారు. మత్స్యశాఖ మొదటి విడుతగా ఒక లక్షా 25 వేల చేప పిల్లలను సరఫరా చేస్తుందన్నారు. దాదాపు రెండు శతాబ్దాలుగా తమ కుటుంబం ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు మృగశిరా కార్తీ ప్రవేశించిన ఘడియల్లో ఓ పదార్థాన్ని చేప ద్వారా రోగి నోట్లో వేస్తున్నామని, అది వ్యాధి తీవ్రతను బట్టి రోగి నాల్గు నుండి ఐదు సంవత్సరాలు తీసుకుంటే పూర్తిగా నయం అవుతోందని అన్నారు. ఈ సేవ తమ కుటుంబ పెద్దలకు నూట తొంబై సంవత్సరాల క్రితం ఓ మునీశ్వరుడు బోధించారని. అప్పటినుండి నిస్వార్థంగా ఉచితంగా లక్షలాదిమంది శ్వాస సంబంధిత రోగులకు ఇస్తున్నామన్నారు. అగ్రవాల్ సేవాదళ్ స్వచ్చంద సంస్థలు రోగులకు భోజనం, కాఫీ, టీలు, మజ్జిగ, మంచినీరు అందిస్తున్నారని తెలిపారు. అత్యవసర వైద్య సదుపాయంతో పాటు క్యూ లైన్‌లో రోగులు ఏ విధమైన ఇబ్బంది పడకుండా వాలంటీర్లు సేవలందిస్తారని ఆయన వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.