- విద్యార్ధులు కష్టపడి చదివితేనే ఎంచుకున్న రంగాల్లో రాణిస్తారు.
- పాలితులుగా ఉన్న ఎస్సీ, ఎస్టీలను పాలకులుగా మార్చింది కాంగ్రెసే.
- అసమానతలు, సామాజిక రుగ్మతలను రూపుమాపిన వారే చరిత్రలో నిలిచిపోతారు.
- దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలు ఆత్మన్యూనతా భావాన్ని వీడాలి.
- విద్యార్ధులకు సీఎం దిశానిర్దేశం.
ముద్ర, తెలంగాణ బ్యూరో : దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఇమిడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. విద్యార్ధులు కష్టపడి చదివితేనే వారు ఎంచుకున్న రంగాల్లో రాణిస్తారని చెప్పారు. అప్పుడే రాష్ట్రం.. దేశం.. సమాజం బాగుంటుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లోని బాబూ జగ్జీవన్‌రామ్ భవన్‌లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ఆధ్వర్యంలోని ఎస్సీ గురుకులాల నుంచి ఐఐటీ, ఎన్ఐటీల్లాంటి ప్రఖ్యాత సంస్థల ప్రవేశాలతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 10 వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు అవార్డుల బహూకరణ, ఉత్తమ ఫలితాలు సాధించిన గురుకులాలకు బుధవారం సీఎం ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. జీవితంలో తొలి మెట్టు ఎక్కబోతున్న విద్యార్థినీ విద్యార్థులంతా కష్టపడి చదువుకుని భవిష్యత్తులో మరింతగా రాణించి రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చదువుకోవడం ద్వారా కుటుంబానికే కాకుండా, సొంత ఊరికి, రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రతిష్టలు తేవొచ్చని ఉద్భోదించారు.పాలితులుగా ఉన్న ఎస్సీ, ఎస్టీలను పాలకులుగా మార్చింది తమ ప్రభుత్వమేనని సీఎం స్పష్టం చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు.కానీ చాలా మంది మహనీయులకు గుర్తింపు తెచ్చింది కులం కాదని చదువు మాత్రమేనన్నారు. సమాజంలోని అసమానతలు, రుగ్మతలను తొలగించి సమసమాజాన్ని నిర్మించేందుకు పాటుపడిన వారు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అలాంటి వారి స్ఫూర్తితోనే ప్రజాప్రభుత్వం ఏర్పడిందని చెప్పారు. తెలుగు యూనివర్సిటీకి తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప రెడ్డి పేరును, మహిళా విద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరును, ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట నామకరణం చేశామన్నారు. ఇలా ఎందరో త్యాగమూర్తుల స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.వందేళ్ల చరిత్రలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి తొలిసారి దళితుడిని వీసీగా నియమించామని సీఎం వెల్లడించారు.ఆ కోవలోనే సార్వత్రిక విశ్వవిద్యాలయానికి, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీకి, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్‌గా, విద్యా కమిషన్ చైర్మన్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా, రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా గతంలో ఎప్పుడూ లేని విధంగా దళిత బిడ్డలు ఈ పదవులు చేపట్టారన్నారు.వారిలో ఎవరికీ కేవలం కులంతోనే అవకాశాలు రాలేదన్న సీఎం ఉన్నత చదువులతోనే వారు ఆ స్థాయికి చేరుకున్నారన్నారు. దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలు ఆత్మన్యూనతా భావాన్ని వీడాలని రేవంత్ రెడ్డి సూచించారు.ఆ లక్ష్యంతోనే రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేడెట్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.ఇక్కడున్న గురుకుల పిల్లల్లో ప్రతిభ, ఆత్మవిశ్వాసం ఉందన్నారు.వారందరూ భవిష్యత్తులో కచ్చితంగా రాణించగలుగుతారన్న నమ్మకం తనకుందని సీఎం చెప్పారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, సలహాదారులు వేం నరేందర్ రెడ్డి,షబ్బీర్ అలీ, పలువురు ఎంపీలు,ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, విద్యార్థినీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు.
