- పాఠశాలకు గైర్హాజరు అయ్యాడని పదో తరగతి విద్యార్థికి పనిష్మెంట్
- మూడు గంటల పాటు ఎండలో నిల్చోబెట్టిన వైనం
- అస్వస్థతకు గురైన విద్యార్థి, ఆసుపత్రిలో చికిత్స
- గుట్టు చప్పుడు కాకుండా పాఠశాల యాజమాన్యం ప్రయత్నం
మెట్ పల్లి ముద్ర: ప్రైవేటు పాఠశాలల నిర్వాహకుల ఆగడాలు రోజురోజుకు పెచ్చు మీరిపోతున్నాయి.విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు.ఉన్నతాధికారులు ఎన్ని ఆదేశాలు జారీ చేసినప్పటికీ తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తూ వారి పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారు.తాజాగా మెట్ పల్లి పట్టణంలోని విజ్ డమ్ హైస్కూల్ లో ఓ విద్యార్థి పాఠశాల తరగతికి గైర్హాజరు అయ్యాడనే కారణంతో మూడు గంటల పాటు ఎండలో నిల్చోపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.గత శనివారం రోజున పట్టణానికి చెందిన పదో తరగతి విద్యార్థి తరగతులకు గైర్హాజరయ్యాడు. సోమవారం తిరిగి పాఠశాలకు రాగా గైర్హాజరైన విషయాన్ని ప్రశ్నిస్తూ పనిష్మెంట్ లో భాగంగా పాఠశాల ఆవరణలోని మైదానంలో సుమారు మూడు గంటల పాటు ఎండలో నిల్చోపెట్టినట్లు బాధిత కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.ఈ విషయంలో సదరు విద్యార్థి స్వల్పంగా అస్వస్థతకు గురికాగా ఆలస్యంగా బయటకు వచ్చింది.ఇదే వ్యవహారంలో పాఠశాల యాజమాన్యాన్ని అడగడానికి వెళ్లిన బాధిత విద్యార్థి కుటుంబ సభ్యులను సైతం దూషిస్తూ యాజమాన్యం కొంత దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం.అయితే మొదటి నుంచి ఈ పాఠశాల పైన విద్యార్థుల తల్లిదండ్రులు అనేక విషయాల్లో తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరించడం సరికాదని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి,ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి సదరు పాఠశాల నిర్వాహకులపై అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని బాధిత విద్యార్థి తల్లిదండ్రులు కోరుతున్నారు.