Take a fresh look at your lifestyle.

దేశం కోసం ప్రధాన మంత్రి అవుతా: రాహుల్ గాంధీ బీజేపీని అడ్డుకోవడానికి సృజన్ అభియాన్‌లో కీలక వ్యాఖ్యలు

బీజేపీ ఆడగాల నుంచి దేశాన్ని రక్షించుకుందాం
మతతత్వ బీజేపీని అడ్డుకోవడం చాలా అవసరం
దేశంలో శాంతి, సమానత్వం, సామరస్యం ప్రమాదంలో ఉంది
మేం అహింసా సిద్ధాంతాన్ని పాటిస్తే.. బీజేపీ హింస మార్గాన్ని ఎంచుకున్నది
సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

ముద్ర, తెలంగాణ బ్యూరో :

బీజేపీ పాలనలో గాడి, అదుపు తప్పుతోన్న దేశంలో శాంతి, సమానత్వం, సామరస్యం స్ధాపన కోసం, ఈ దేశం కోసం ప్రధానమంత్రి అవుతానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. పదకొండేళ్ల మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో వెనకబాటుకు గురయిందనీ… ప్రధానంగా శాంతి భద్రతల స్ధాపన విషయంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ద్వేషం ప్రజల మధ్య విభేదాలు సృష్టించి ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తోందన్న రాహుల్ గాంధీ.. మనం అప్రమతంగా ఉండి బీజేపీ ఆగడాలను అడ్డుకొని దేశాన్ని రక్షించాలన్నారు. “సంఘటన సృజన్ అభియాన్” కార్యక్రమం భాగంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని హరిత రిసార్ట్‌లో నిర్వహించిన డీసీసీ అధ్యక్షుల పది రోజుల శిక్షణ శిబిరం సోమవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాహుల్ గాంధీ, కేసి వేణు గోపాల్, సీఎం రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం అహింస, శాంతి, సత్యాన్వేషణ అన్నారు. ఈ సిద్ధాంతాల ఆచరణ కోసం ప్రతి కార్యకర్త నిరంతరం పని చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో సమానత్వ సిద్ధాంతానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుందన్న రాహుల్ గాంధీ.. కుల, మత, వర్గ, లింగ బేధాలు లేకుండా, పేద ధనిక అనే తార తమ్యాలు లేకుండా అందరిని గౌరవిస్తూ పార్టీని నడిపించాలని పార్టీ జిల్లాల అధ్యక్షులకు పిలుపునిచ్చారు. అహంకారాన్ని విడి పార్టీ, ప్రజల కోసం పని చేయాలని సూచించారు. ప్రజలు పార్టీకి బలం కావాలనీ అదే సమయంలో పార్టీ ప్రజలకు బలం కావాలన్నారు. ప్రజలతో కలిసిపోయి వారితో మమేకం అయ్యి వారి కోసమే కాంగ్రెస్ పార్టీ పని చేసే విధంగా మన కార్యాచరణ ఉండాలన్నారు. మన పార్టీ గుర్తు చేయి గుర్తు అంటే అభయ ముద్ర, ప్రపంచంలోని అన్ని మతాల చిహ్నం కూడా అభయ ముద్రనే అన్నారు. అదే మన సిద్ధాంతమన్నారు. ప్రధానంగా పార్టీలో మహిళలను గౌరవించాలన్న రాహుల్ గాంధీ.. వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా బాధ్యులకు సూచించారు. డీసీసీ అధ్యక్షులు పార్టీ బలోపేతం కోసం ప్రజల కోసం పని చేయాలన్నారు. మీ భవిష్యత్ నేను చూసుకుంటా. మీరు బాగా పని చేస్తే ఏ స్థాయి వరకు అయినా నాయకులుగా ఎదిగే అవకాశం ఉంటుందని భరోసా ఇచ్చారు. మీ కార్యాచరణ మీ పని విధానము.. ప్రజల కోసం ఉండాలన్నారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వసం ఏర్పడి వాళ్ళు పార్టీ వైపు ఆకర్షితులు కావాలన్నారు. డీసీసీ అధ్యక్ష పదవి ఆకర్షణ కోసం కాదనీ అది ఒక బాధ్యతగా పని చేయాలన్నారు. కాంగ్రెస్ అంటే శాంతి, అహింస, సత్య వాక్కు వీటితోనే మనం ప్రజల్లోకి వెళ్లాలన్నారు. ప్రజల సమ్మతితోనే మనం అధికారంలోకి రావాలన్నారు.

రాహుల్ ను ప్రధాని చేద్దాం
రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే కాంగ్రెస్ కార్యకర్త లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశం కోసమైనా రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆకాంక్షించారు. వికారాబాద్‌ జిల్లా అనంతగిరి హిల్స్‌లో కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి , కేసీ వేణుగోపాల్‌, కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రజా జీవితంలో తానెప్పుడూ పైరవీలు చేయలేదని అన్నారు. గతంలో ప్రజా సమస్యలపై గళం విప్పిన నాపై కేసులు పెట్టారని గుర్తుచేశారు. ఈ సమావేశంలో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రణాళికబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ అంశాలపై నేతలతో రాహుల్‌ గాంధీ చర్చించారు.

రాహుల్ సూచనతోనే బీసీలకు ప్రాధాన్యత : టీపీసీసీ చీఫ్
రాహుల్ గాంధీ చూపిన బాటలో తెలంగాణ లో బిసి లకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. వందేళ్లలో చేయని కులగణన అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి చరిత్ర ఎన్నడు లేని విదంగా సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారన్నారు. ఆ బిల్లు అమలు కాకుండా బీజేపీ, బిఆర్ఎస్ లు కుట్రలు చేస్తే పార్టీ పరంగా బిసి లకు.పంచాయతీ, మునిసిపల్, కార్పొరేటర్లు లలో అధిక ప్రాధాన్యత ఇచ్చి వారిని గెలిపించి నిరూపించామని చెప్పారు. చట్టపరంగా 28 శాతం బిసి లకు రిజర్వేషన్లు ఉంటే అనేక జనరల్ స్థానాలలో బిసి లను నిలబెట్టి గెలిపించిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. అత్యంత కీలకమైన డీసీసీ ల నియామకంలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చామన్న మహేశ్ కుమార్ గౌడ్… త్వరలోనే అన్ని జిల్లా కమిటీలు పూర్తి చేసి పార్టీ ని అత్యంత బలోపేతం చేస్తామని ప్రకటించారు.డీసీసీ అధ్యక్షులకు 10 రోజుల పాటు పార్టీ సిద్ధాంతాలపై సంపూర్ణంగా శిక్షణ ఇవ్వడం అందులో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొనడం చరిత్రాత్మకమైందని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.