Take a fresh look at your lifestyle.

పాలమూరు కాంగ్రెస్ లో  ఎవరికి వారే….!

 

 

– మున్సిపల్ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ లో కల్లోలం 

– రెండు వర్గాలుగా చీలిన నాయకులు 

– ఎమ్మెల్యే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న డీసీసీ అధ్యక్షులు 

– తమ వర్గం నేతకు మేయర్ పదవి ఇవ్వలేదని ఎమ్మెల్యే పై తిరుగుబాటు 

– టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వచ్చినా ఇరు వర్గాల నేతల ఎడమోహం 

– కాంగ్రెస్ నేతల చీలికను ఆసరాగా చేసుకుంటున్న బీ ఆర్ ఎస్ 

– కాంగ్రెస్ నేతలు, కార్పొరేటర్లు టచ్ లో ఉన్నారని బీ ఆర్ ఎస్ మాజీ మంత్రి ప్రకటన 

– వర్గ రాజకీయాలతో పాలమూరు కాంగ్రెస్ సతమతం 

– పాలమూరుకు టీపీసీసీ అధ్యక్షులు వచ్చి వర్గ నేతలను కలిపే పనిని పట్టించుకోలేదు 

 

ముద్ర, ఉమ్మడి 

మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :

………………………………………

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాలమూరు లో మళ్ళీ మేమే గెలుస్తాం… మాకు ఎదురు ఏ పార్టీ పోటీలో నిలబడదు…. వచ్చే ఎన్నికలే కాదు 2034 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉంటుంది… పాలమూరు కు వచ్చిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాటలు ఇవి. రాష్ట్రం లో అధికారం దేవుడెరుగు.. కానీ పాలమూరు కాంగ్రెస్ లో ఏమి జరుగుతుందో ఆయనకు తెలియంది కాదు. ఇక్కడ వర్గ రాజకీయం తో సతమతమవుతూ పార్టీ భవిష్యత్ ఎలా ఉంటుందో తెలియకుండా మళ్ళీ ఎన్నికల్లో అసెంబ్లీ స్థానం గెలుచుకుంటామనే ధీమా ఆయనకు ఎలా కల్గిందో పార్టీ నేతలే చెప్పాలి. రెండు వర్గాలు ఏర్పడానికి ఆజ్యం పోసిందే టీపీసీసీ నేతలనే ఆరోపణలు పాలమూరు లో ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు రెండు వర్గాలుగా ఏర్పడి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.ఇలాంటి పరిస్థితి లో కాంగ్రెస్ పార్టీ మనుగడ ఎలా సాధిస్తుందో నేతలకే తెలియాలి. కాంగ్రెస్ లో జరుగుతున్న వర్గ పోరు ను బీ ఆర్ ఎస్ పార్టీ అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది. కాంగ్రెస్ నేతలు ఒక్కటిగా నిలబడకుంటే గులాబీ పార్టీ కి బంగారు పళ్లెం లో అధికారం ఇవ్వవలసిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నేతలు దక్కుతుంది.

……………………………………..

వర్గ పోరు మొదలైంది ఇక్కడ :

……………………………………

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కటై పార్టీ ని విజయతీరాలకు చేర్చారు. ఎమ్మెల్యే గా యెన్నం శ్రీనివాస్ రెడ్డి ని మంచి మెజారిటీ తో గెలిపించారు. రెండేళ్ల పాటు అందరూ కలిసి ఒక్క తాటి పై నిలబడ్డారు. అంతా మంచి జరుగుతుందనే సమయం లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో  వర్గ పోరు మొదలైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి చెందిన కార్పొరేటర్లు అధిక సంఖ్య లో గెలిచారు. ఇక్కదే అసలు కథ మొదలైంది. మేయర్ పదవి కోసం ముందుగా అనుకున్న వారు ఓటమి చెందారు. ఇందులో ఎన్ పి వెంకటేష్ కూతురు నేహాశ్రీ,ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ భార్య స్వప్న ఓటమి చెందారు.వీరి ఓటమికి కాంగ్రెస్ కు చెందిన వారే కృషి చేశారనే ఆరోపణలు వచ్చాయి. వీరు ఓటమి చెందితే తన భార్య కు మేయర్ పదవి వస్తుందని ఆనంద్ గౌడ్ తమ ఓటమికి డబ్బులు, మద్యం సరఫరా చేశారని ఓటమి చెందిన నేతలు ఆరోపించారు. ఆనంద్ గౌడ్ గతం లో బీ ఆర్ ఎస్ నుంచి కౌన్సిలర్ గా గెలిచి పాలమూరు మున్సిపాలిటీ కి చైర్మన్  అయ్యారు. కొద్ది రోజులకు అప్పటి బీ ఆర్ ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో విబేదాలు వచ్చి   బీ ఆర్ ఎస్ ను వీడి చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తరువాత కాంగ్రెస్ కౌన్సిలర్ల అండతో మళ్ళీ చైర్మన్ పదవి దక్కించున్నారు. అనంతరం వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆనంద్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారం చేశారు. యెన్నం గెలిచిన తరువాత ఆనంద్ గౌడ్ మున్సిపల్ చైర్మన్ గా ఉండడం తో ఇద్దరి మధ్య మంచి సన్నితం ఏర్పడింది.కొద్ది రోజులకు విరిద్దరి మధ్య కాస్తా విబేదాలు వచ్చాయి. అప్పటి నుంచి ఎమ్మెల్యే కు దూరంగా ఉంటూ వచ్చారు.

ఇటీవల వచ్చిన మున్సిపల్ కార్పొరేషన్ బీసీ మహిళ కు రిజర్వేషన్ వచ్చింది. దీంతో

ఆనంద్ గౌడ్  భార్య విజయం సాధించారు. అందరూ ఈమెకే మేయర్ పదవి వస్తుందని ఊహించారు. కానీ అనుకోని విధంగా ముదిరాజ్ ఆడబిడ్డ మమతకు మేయర్ పదవి దక్కింది. దీంతో ఆనంద్ గౌడ్ కు మేయర్ పదవి  దక్కకుండా ఎమ్మెల్యే పావులు కదిపారనే కొందరు కాంగ్రెస్ నేతలు ఒక వర్గంగా ఏర్పడ్డారు. మేయర్ పదవి ఆనంద్ గౌడ్ కు ఇవ్వాలని డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, మార్కెట్ యార్డు చైర్మన్ అనిత మధుసూదన్ రెడ్డి పట్టుబట్టినా ఫలితం దక్కకపోవడం తో ఎమ్మెల్యే కు దూరమయ్యారు. డిప్యూటీ చైర్మన్ పదవి తన కుమారునికి ఇవ్వాలని డీసీసీ మాజీ అధ్యక్షులు ఓబేదుల్లా కొత్త్వాల్ పట్టుబట్టారు.ఐ పదవి ఎమ్మెల్యే అనుచరుడు సురేందర్ రెడ్డి కి దక్కడం తో ఆయన కూడా ఎమ్మెల్యే కు దూరమయ్యారు. ప్రస్తుతం వీరంతా ఆనంద్ గౌడ్, సంజీవ్ ముదిరాజ్, అనిత, ఓబేదుల్లా కొత్త్వాల్ ఒక వర్గం గా ఉండిపోయారు. వీరంతా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలకు వెళ్లకుండా దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యే కూడా వీరిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు. ఒక వర్గానికి టీపీసీసీ మద్దతుగా ఉందని, అందుకే ఆ నలుగురు ఎమ్మెల్యే కు దూరంగా ఉంటున్నారనే ఆరోపణలు కాంగ్రెస్ నేతలే చేస్తున్నారు.

…………………………………….

రెండు వర్గాలను కలపని టీపీసీసీ :

……………………………………

మంగళవారం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పాలమూరు కు వచ్చి డీసీసీ కొత్త కార్యవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సమయం లో కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతున్న వర్గ పోరును ఆయన పట్టించుకోలేదు. రెండు వర్గాలను సమన్వయం చేసేందుకు ఆయన కాస్తా కూడా ప్రయత్నం చేయలేదు. టీపీసీసీ అధ్యక్షులు వస్తున్నారని, ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ వర్గ నేతలను ఒక్కటిగా చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన అవేమి పట్టించుకోకుండా మౌనం గా ఉండిపోయారు. కానీ ఆయన స్పీచ్ లో మాత్రం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాలమూరు లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందన్నారు. వర్గ పోరు సమిసిపోకుండా కాంగ్రెస్ పార్టీ ఎలా గెలుస్తుందని ఆ పార్టీ నేతలే   బాహిరంగ విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లో ఇలాగే పరిస్థితి ఉంటే వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమే అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఏదియేమైన కాంగ్రెస్ లో వర్గ పోరు మంచిది కాదనే అభిప్రాయాన్ని రాజకీయ వేత్తలు పేర్కొంటున్నారు.

……………………………………..

కాంగ్రెస్ వర్గ పోరు బీ ఆర్ ఎస్ కు అనుకూలమా..?

……………………………………..

పాలమూరు కాంగ్రెస్ పార్టీ లో ఉన్న వర్గ పోరును బీ ఆర్ ఎస్ అనుకూలంగా మార్చుకునే పడింది. ఇప్పటికే ఆ పార్టీ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఒక వర్గం నేతలు టచ్ లో ఉన్నారు. ఈ విషయం స్వయంగా ఆయనే ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు బీ ఆర్ ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇంకా మీరుండేది రెండేళ్లు అని, ఎన్నుకున్న ప్రజలకు సేవచేయండి అని చెప్పానని మీడియా సమావేశం లో ఆయన తెలిపారు. పాలమూరులో కాంగ్రెస్ ఉండేది ఇంకా రెండున్నర ఏళ్ళు అని వచ్చేది బీ ఆర్ ఎస్ పార్టీ అని అన్నారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి  పాలమూరు కాంగ్రెస్ లో ఎవ్వరూ ఉండరని, వారంతా బీ ఆర్ ఎస్ పార్టీ లో ఉంటారని శ్రీనివాస్ గౌడ్ అంటున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల వరకు ఉంటే శ్రీనివాస్ గౌడ్ మాటలు నిజమయ్యే అవకాశం ఉంది.

Leave A Reply

Your email address will not be published.