Take a fresh look at your lifestyle.

జగన్మోహిని అలంకారంలో యాదగిరీషుడు..

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
యాదగిరీషుడు జగన్మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చాడు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించ బడుచున్నవి.
బ్రహ్మోత్సవములలో భాగంగా మంగళవారం ఉదయం శ్రీ స్వామివారి ఆలయంలో నిత్యారాధనల అనంతరం శ్రీ స్వామివారిని జగన్మోహిని అలంకార శేవలో అలంకరించి భక్తుల దర్శనార్థం తిరువీధులలో ఊరేగింపు వేడుక నిర్వహించారు. ఈ వేడుకలను శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రానుసారముగా ఆలయ ప్రధానార్చకులు, ఉపప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, వేదపండితులు, అర్చక బృందం, పారాయణీకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో కార్యనిర్వహణాధికారి జె.భవానీశంకర్, ఆలయ అనువంశికధర్మకర్త బి. నరసింహామూర్తి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరు ఎమ్. హనుమంతరావు, ఉపకార్యనిర్వహణాధికారి, సహాయకార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులుపాల్గొని శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు.

జగన్మోహిని అలంకార శేవ ప్రత్యేకత

శ్రీరసాగర మదనవేళ అమృతము ఉద్భవించగా రాక్షసులకు అందజేయకుండుటకై శ్రీ మహా విష్ణువు దరించిన రూపము జగన్మోహనాకార జగన్మోహిని రూపము. శ్రీ స్వామి వారు జగన్మోహినిగా అవతరించిన వేళలో పక్కనే ఉన్న శ్రీదేవి, భూదేవిలు ఎవరా ఈ సౌందర్యరాశి అని అసూయపడినట్లుగా పోతన భాగవతం పేర్కొనుచున్నది. తళుకు బెళుకుల నడకల హొయలు కంటి సౌందర్యంచే పరవశింపచేయు దివ్యాకృతిని కలిగి తమోగుణం ప్రధానంగా గల రాక్షసుల భారి నుండి అమృత బాండమును దేవతలకు అందించుట జగన్నాటక సూత్రధారి కల్పించిన అపూర్వ సన్నివేశము ఈ జగన్మోహిని రూపము. “ఏతత్ రూపం తత్ కళ్యాణ తమం పశ్యామి” అని సకల చరాచర జగత్తు అంతా జగన్మోహిని సౌందర్యాన్ని దర్శించి పరవశించిన తీరు ఎంతో ప్రస్తుతింపబడినది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు తమ సర్వావయవ సంపద చేత లోకములన్నింటినీ సమ్మోహన పరుచుట ఈ జగన్మోహిని అలంకారములో ఆనందింపచేయుచూ ప్రత్యేకమైయున్నది.

సాయంకాలం అశ్వవాహనశేవ…ఎదుర్కోలు మహోత్సవము

మంగళవారం సాయంకాలం శ్రీ స్వామివారి ఆలయంలో నిత్యారాధనల అనంతరము రాత్రి శ్రీ స్వామివారిని “అశ్వవాహనశేవ” లో అలంకరించి ఎదుర్కోలు మహోత్సవమును ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, వేద పండితులు, అర్చక బృందం, పారాయణీకులు అత్యంత వైభవంగా నిర్వహించెదరు. ఈ వేడుకలో ఆలయ అధికారులు ఉద్యోగ సిబ్బంది, భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

అశ్వవాహన శవ ఎదుర్కోలు మహోత్సవము ప్రత్యేకత

బ్రహ్మోత్సవములలో శ్రీ స్వామి వారు అశ్వ వాహనారూఢుడై విచ్చేయుట జీవుల చంచల స్వభావమును దానిని తానే నియంత్రించగలనని అశ్వ వాహనంపై విచ్చేసి భక్తకోటిని రక్షించి అనుగ్రహించుట ప్రత్యేకమైనది. బ్రహ్మోత్సవములలో ప్రధానమైన చుట్టముగా ఈ ఎదుర్కోలు వేడుక నిర్వహించెదరు. భగవానుని వేడుకొను ప్రక్రియనే ఎదుర్కోలు అని ప్రసిద్ధి. అమ్మవారి పక్షాన ఆచార్య పురుషులు నిత్యముక్తులు, జీవకోటి పరస్పరము అమ్మవారి గుణములను పేర్కొనుచూ పరమానంద భరితులగుట ఈ ఉత్సవ ప్రత్యేకత. వేదాంతదేశికులు శ్రీ పరాశర భట్టర్ వారు అమ్మవారి వైభవమును స్తుతిస్తూ అత్రావతీర్యా ననులోచన గోచరో భూ: అంటూ ఎక్కడో పరమపదములో పరమాత్మతో దివ్యత్వమును అనుభవించు అమ్మవారు జీవకోటి రక్షణార్ధము నేల మీదకి దిగిరావడం ఎంత ఆశ్చర్యకరమని అమ్మవారి దయాగుణ స్వరూపమును పేర్కొనిరి. పరమాత్మ అయిన శ్రీస్వామివారిని(వరుడుని) నీలమేఘశ్యాముడిగా నీలతోయధమధ్యస్థా విద్యుల్లేఖవభాస్వర. అని ఉపనిషత్తులుపేర్కొనడం, మకరకుండలమయ కేయూరాధి విభూషితుడగు మణి కిరీటధారి ఆశ్రిత జనరక్షక అఖిలాండకోటి బ్రహ్మాండనాయక అని వివిధ స్తోత్రములలో ప్రార్థిస్తూ ఆనందమును అనుభవించు సన్నివేశము ఎంతో అపూర్వమైయున్నది.

Leave A Reply

Your email address will not be published.