- జర్నలిస్టుల సంక్షేమమే టియుడబ్ల్యూజే( ఐజేయు) లక్ష్యం
- యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్
ముద్ర. వీపనగండ్ల: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా విలువలతో కూడిన జర్నలిజాన్నిపరిరక్షించాలని టియుడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ అన్నారు.బుధవారం చిన్నంబావి మండల కేంద్రంలో టియుడబ్ల్యూజే( ఐజేయు) సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రభుత్వానికి,ప్రజలకు వారధిగా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు.వాస్తవ పరిస్థితులను సమాజానికి అందించాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందని అన్నారు.ప్రజాస్వామ్యంలో నాలుగవ పిల్లర్ గా ఉన్న జర్నలిజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు.జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా టియు డబ్ల్యూజె (ఐజెయూ) పనిచేస్తుందని అన్నారు.జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అందించడంలో,జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించడంలో యూనియన్ ఎంతో కృషి చేస్తుందని చెప్పారు.తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద యూనియన్ గా టి యు డబ్ల్యూజే కొనసాగుతుందని అన్నారు.ప్రతి జర్నలిస్టు యూనియన్ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ సొసైటీ సబ్ కమిటీ మెంబర్ శ్రీనివాసరావు,జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి మాధవరావు, సీనియర్ జర్నలిస్టులు బి రాజు,విజయ్ కుమార్,రవికాంత్, కొల్లాపూర్ తాలూకా అధ్యక్షులు రాజు,సురేష్,వెంకటస్వామి, చిన్నంబావి మండల అధ్యక్షుడు భాను ప్రకాష్, నాయకులు కిరణ్, శివ, శ్రీకాంత్, సత్యం తదితరులు పాల్గొన్నారు.