ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
జోగులాంబ గద్వాల జిల్లాలోని సామాజిక సమస్యల పరిష్కారానికి, అన్ని రంగాల్లో అభివృద్ధికి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో అందరూ కలిసికట్టుగా ముందుకెళదామని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పిలుపునిచ్చారు.
ఆదివారం ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, దేశ ఉప ప్రధానిగా పనిచేసిన బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతినీ పురస్కరించుకుని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వివిధ శాఖల కేంద్ర మంత్రిగా పనిచేసిన జగ్జీవన్ రామ్ దూర దృష్టితో దేశంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు తన జీవితాంతం కృషి చేశారని కొనియాడారు. మహనీయుల జీవిత చరిత్రలు నేటి పిల్లలకు, భవిష్యత్తు తరాలకు తెలియాలంటే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఎంతో అవసరమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సీనియర్ సిటిజన్లు, చిన్నారుల సంక్షేమానికి అన్ని సంఘాల నేతలు కలిసికట్టుగా ముందుకు రావాలని కోరారు. విద్యాపరంగా వెనుకబడ్డ జోగులాంబ గద్వాల జిల్లాలో విద్యార్థులు బడి మధ్యలో మానివేసే పరిస్థితులను రూపుమాపాల్సి ఉందన్నారు. సెన్సెస్ కు సంబంధించి మే మొదటి వారం నుంచి ఇండ్ల గణన చేపడుతున్నామని, వచ్చే ఏడాది జనాభా గణన చేసే నాటికి జిల్లా అక్షరాస్యతలో మెరుగుపడేలా అన్ని సంఘాల నేతలు సహకరించాలన్నారు. జిల్లాలో బాల్య వివాహాలు జరగకుండా అరికట్టాలని కోరారు. ఇటీవల జిల్లాలో పోక్సో కేసులు పెరుగుతున్నాయని, చిన్నారులపై అఘాయిత్యాల నివారణకు కృషి చేయాల్సి ఉందన్నారు. ప్రతినెల చివరి శనివారం అన్ని మండలాల్లో సివిల్ రైట్స్ డే నిర్వహిస్తామని, ఎక్కడైనా అంటరానితనం ఉన్నట్లు తెలిస్తే విజిలెన్స్ కమిటీ ద్వారా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. పలువురు వక్తలు కోరినట్లు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ నూతన విగ్రహ ఏర్పాటుకు, అంబేద్కర్ భవన్ నిర్మాణానికి కృషి చేస్తామని, ఇండోర్ స్టేడియం వద్ద ఉన్న సమస్యలను, ఇతర డిమాండ్లను పరిష్కరిస్తామన్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరించిన వారందరికీ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.

జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా బ్రిటిష్ వారి నుంచి దేశానికి విముక్తి కలిగించేందుకు పోరాటం చేసినట్లే, జిల్లా సమస్యలను పారద్రోలేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. పలు సంఘాల నేతలు తెలిపిన సామాజిక సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం తరపున కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నారు.
అంతకుముందు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి కలెక్టర్ తో పాటు ఇతర అతిధులు, పలు రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా సంఘాల నేతలు ప్రసంగించారు. తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు తమ పాటలతో అలరించారు. అలాగే ఐడిఓసి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్, ఎస్పీ పలు ప్రజాసంఘాల నేతలతో కలిసి పూలమాలలు వేసి పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఆర్డీవో శ్రీనివాసరావు, డీఎస్పీ మొగిలయ్య, ఎస్సీ సంక్షేమ శాఖ ఈడి నుషిత, బీసీ సంక్షేమ శాఖ అధికారి అక్బర్ బాషా, ఇతర అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నేతలు, తదితరులు పాల్గొన్నారు.