- మరోసారి ఈడీ నోటీసులు
- ఈ నెల 16న విచారణకు పిలుపు
- పండుగ ముందు ఏసీబీ విచారణ
ముద్ర, తెలంగాణ బ్యూరో :- ఫార్ములా ఈ….కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16వ తేదీన విచారణకు హాజరుకావాల్సిందే అంటూ నోటీసుల్లో స్పష్టం చేసింది.హైకోర్టు క్వాష్ పిటిషన్ ను తిరస్కరించిన వెంటనే.. కేసు విచారణలో భాగంగా పండుగ తరువాత (16న) న వ్యక్తిగతంగా విచారణకు రావాల్సిందేనంటూ ఈడీ నోటీసులు జారీ చేయడం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా మంగళవారం (7న) నాడు తమ ఎదుట హాజరుకావాలని ఈడీ ఇప్పటికే కేటీఆర్‌కు నోటీసు ఇచ్చింది. మంగళవారం తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో తనకు సమయం ఇవ్వాలని ఈడీని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఈడీకి కేటీఆర్ మెయిల్ పంపారు. హైకోర్టుపై ఉన్న గౌరవంతో.. తీర్పు వచ్చేంత వరకు సమయం ఇవ్వాలని విన్నవించారు. అయితే కేటీఆర్ విజ్ఞప్తిపై ఈడీ అధికారులు స్పందించింది. విచారణకు మరో తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది. మరోవైపు కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే ఈడీ కేటీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ చేసింది.
గులాబీలో గుబులు
కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడం.. వెంటనే ఈడీ 16న విచారణకు రావాలని ఆదేశించడం, మరోవైపు నగరంలో ఏసీబీ సోదాలతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. కేటీఆర్ అరెస్ట్‌పై స్టేను సైతం ఎత్తివేయడంతో భవిష్యత్తు కార్యచరణకు సిద్ధమైంది. హైకోర్టు క్వాష్ పిటీషన్ కొట్టివేసిన వెంటనే హైదరాబాద్ లోని నంది నగర్ లో ఉన్న కేటీఆర్ నివాసంలో మాజీ మంత్రులు,ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ అయ్యారు. మాజీ మంత్రి లీగల్ టీమ్స్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. హై కోర్టు ఫుల్ బెంచ్ వెళ్లాలా? సుప్రీంకోర్టుకు వెళ్లాలా? అనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పుడు ఏసీబీ ఏ నిర్ణయం తీసుకుంటుంది? అనే దానిపై బీఆర్‌ఎస్‌లో ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ అరెస్ట్ చేస్తే ఇప్పటికిప్పుడు ఏమి చేయాలి అనే అంశంపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.