ముద్ర, వనపర్తి:
ఈ రబీ సీజన్లో వనపర్తి జిల్లాలో దాదాపు 3.75 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని అందులో గృహవసరాలు ఇతరత్రా పోను 2.70 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని మొత్తం ధాన్యాన్ని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేయాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.

బుధవారం జిల్లా పౌర సరఫరాల అధికారి ఆధ్వర్యంలో ఐ డి ఓ సి సమావేశ మందిరంలో వ్యవసాయ మండల అధికారులు, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, సహకార సంఘాల సీఈవోలు ఈ.పి.యం లతో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పై సమావేశం నిర్వహించగా అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ఈసారి 414 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇందులో ఐకెపి సిబ్బందికి 192 కేంద్రాలు పిఎసిఎస్ సంఘాలకు 214 మెప్మా కు 8 వరి కొనుగోలు కేంద్రాలు కేటాయించినట్లు తెలిపారు. వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మడానికి వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. రైతుల కోసం కొనుగోలు కేంద్రంలో టెంట్ , తాగునీరు, కుర్చీలు ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రంలో రిజిస్టర్లు పెట్టాలని, రైతులు ధాన్యం తెచ్చినప్పుడు తేమ ఎంత ఉంది అనే విషయాలను అందులో రాయాలని, ధాన్యం తెచ్చినప్పుడు, కొనుగోలు చేశాక రైతు నుండి మొబైల్ నుండి ఓటిపి తీసుకొని పోర్టల్ లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. అనుమతి లేకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకోడానికి వీలు లేదని, నిర్దేశించిన కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిర్దేశించిన మిల్లుకు మాత్రమే తరలించాలని అలా కాకుండా వేరే మిల్లులకు తరలించిన లేదా మరి ఎక్కడైనా నిలువచేసిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ధాన్యాన్ని ఎఫ్.సి .ఐ నిబంధనల మేరకు నాణ్యమైన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని దీని కొరకు వ్యవసాయ విస్తీర్ణాధికారులు హార్వెస్టర్ లపై నియంత్రణ ఉండాలని సూచించారు. తాలు, చెత్త లేకుండా ఉండేందుకు హార్వెస్టింగ్ చేసేటప్పుడు యంత్రంలో 19-21 ఆర్. పి.యం. ఉండేవిధంగా నిర్దేశించాలని సూచించారు.
అన్ని కొనుగోలు కేంద్రంలో అవసరమైన మేరకు తార్పాలిన్లు, తేమ కొలిచే యంత్రాలు, తూకం వేసే యంత్రాలు, గన్ని బ్యాగులు ఉండే విధంగా చూడాలని సూచించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఆన్లైన్ లో వివరాలు అప్లోడ్ చేయాలని లేనిపక్షంలో రైతులకు డబ్బులు పడటంలో ఆలస్యం అవుతుందన్నారు.
ప్రభుత్వం సన్నాలకు రూ. 500 బోనస్ కల్పిస్తున్న నేపథ్యంలో ధాన్యాన్ని గుర్తించడంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. సన్న రకం వరి ధాన్యాన్ని గుర్తించడంలో, ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇంచార్జ్ లకు క్లస్టర్ల వారిగా రైతులకు, కొనుగోలు కేంద్రాల ఇంచార్జీలకు శిక్షణ ఇవ్వాలని వ్యవసాయ విస్తీర్ణాధి కారులను ఆదేశించారు. ప్రతి ఇంచార్జీకి డిజిటల్ గ్రేయిన్ కాలిబర్ మీటర్ ను ఎలా వినియోగించాలో తెలిసి ఉండాలని, సన్న రకం వరి ధాన్యానికి, దొడ్డు రకానికి వేరువేరుగా కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో పౌరసరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్, పి.డి. డిఆర్డిఓ ఉమాదేవి, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి బి. రాణి, మార్కెటింగ్ అధికారి స్వరణ్ సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, ఉద్యాన శాఖ అధికారి విజయ భాస్కర్, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తీర్ణాధికారులు, సహకార సంఘం సి.ఈ.ఓ లు తదితరులు పాల్గొన్నారు.