Take a fresh look at your lifestyle.

మీసేవ యూజర్ ఛార్జీలు పెంపు

కనిష్టంగా రూ. 35 ఉన్న సర్వీస్ ఛార్జీ రూ. 62
బి-కేటగిరీ సేవలకు రూ. 80
విద్యుత్ బిల్లుల చెల్లింపులు, ఆర్టీఏ సేవలు, ఇతర ప్రభుత్వ అఫ్లికేషన్లపైనా భారం

ముద్ర, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీసేవ కేంద్రాల్లో వివిధ రకాల ధృవీకరణ పత్రాలు, బిల్లు చెల్లింపుల కోసం వసూలు చేసే యూజర్ ఛార్జీలను భారీగా పెంచింది. ఈ మేరకు ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కనిష్టంగా రూ. 35 ఉన్న సర్వీస్ ఛార్జీని ఇప్పుడు ఏకంగా రూ. 62కు పెంచారు. పెరిగిన ధరలు బుధవారం నుంచే అమలులోకి వస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తాజా పెంపు ప్రకారం.. తక్షణమే లభించే ఏ-కేటగిరీ సర్టిఫికెట్ ప్రింట్ వంటి సేవలకు రూ. 62 వసూలు చేయనుండగా.. ఇన్‌కం, క్యాస్ట్, నివాస ధృవీకరణ పత్రాల వంటి బి-కేటగిరీ సేవలకు రూ. 80గా ధరను నిర్ణయించారు. వీటితో పాటు విద్యుత్ బిల్లుల చెల్లింపులు, ఆర్టీఏ సేవలు, ఇతర ప్రభుత్వ అఫ్లికేషన్లపై కూడా అదనపు భారం పడనుంది. ఇన్‌కం సర్టిఫికేట్‌కు గతంలో రూ.45 నుంచి రూ.55 ఉండగా.. తాజా సవరణల ప్రకారం రూ.80కి చేరింది. కుల ధ్రువీకరణ పత్రం గతంలో రూ.45 నుంచి 55 ఉంగా.. ఇప్పుడు రూ.80కి చేరింది. స్థానికత ధ్రువీకరణ పత్రం గతంలో రూ.45 నుంచి రూ.55 ఉండగా.. ప్రస్తుతం రూ.80కి పెంచారు. అదేవిధంగా జనన ధ్రువీకరణ పత్రం ప్రింట్ గతంలో రూ.40 నుంచి రూ.45 ఉండగా.. తాజాగా రూ.62కు పెంచారు. దీంతో సాధారణంగా విద్యాసంస్థల్లో ప్రవేశాలకు, ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకునే సమయంలో విద్యార్థులు క్యాస్ట్, ఇన్‌కం, నివాస ధ్రువీకరణ పత్రాలను విధిగా తీసుకోవాల్సి ఉంటుంది. తాజాగా ఈ మూడింటి ధరలను ఏకంగా రూ. 80కు పెంచడంతో మధ్యతరగతి, పేద వర్గాల విద్యార్థులపై ఆర్థిక భారం పడనుంది. కాగా, చాలా కాలంగా మీసేవ కేంద్రాల నిర్వాహకులు తమకు వచ్చే కమీషన్ పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పెరిగిన విద్యుత్బిల్లులు, ఇంటర్నెట్, సిబ్బంది ఖర్చుల దృష్ట్యా ఈ పెంపు అనివార్యమని మీసేవ కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఈ క్రమంలోనే తాజాగా ఛార్జీలు పెంచారు. అయితే ఛార్జీలను భారీగా పెంచటంపై సామాన్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ మీ-సేవ సూపర్ హిట్
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ మీ-సేవ విధానానికి ప్రజల నుంచి భారీ ఆదరణ లభిస్తోంది. కేవలం ఒక వాట్సాప్ మెసేజ్‌తో 581 రకాల ప్రభుత్వ సేవలను పొందే వెసులుబాటును సర్కార్ కల్పించింది. 8096958096 నంబర్ ద్వారా 24 గంటల పాటు పదికి పైగా ప్రభుత్వ శాఖల సేవలు ప్రజలకు అందుబాటులో ఉంచారు. రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ వంటి 10కి పైగా కీలక ప్రభుత్వ శాఖలకు చెందిన ధృవీకరణ పత్రాలు, బిల్లుల చెల్లింపులు వంటి సేవలు ఇందులో అందుబాటులో ఉన్నాయి. మీ-సేవ కేంద్రాలకు వెళ్లే అవసరం లేకుండా తక్కువ సమయంలో పారదర్శకంగా సేవలు అందుతుండటంతో డిజిటల్ తెలంగాణ దిశగా ఇది ఒక కీలక అడుగుగా నిలిచింది.

Leave A Reply

Your email address will not be published.